పుట:పంచతంత్రి (భానుకవి).pdf/119

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్థలభూగామికి? నొక్కనాఁడు గతి మందంబైన, మన్మానసం
బలరంజేయవు నేఁడు శీఘ్రగతిచే నన్నన్, బ్రియంబొప్పఁగన్.

127


క.

నా కాహారము లేదన,
భేకంబులఁ గొన్ని దినుము ప్రియమున నన్నన్
గాకోదరమ్ము వానిం
జేకొని భక్షించె నతఁడు సెప్పినమాడ్కిన్.

128


వ.

అప్పు డాజలపాదుం జూచి భవదనుజ్ఞఁ జేసి మద్భోగమ్ము
పోషింపంబడియె, నీవు విఖ్యాతచారిత్రుండవు నీ విడిన యాహారం బగుటం
జేసి విప్రశాపంబు నన్నేమియుం జేయలేదు, నీనిమిత్తంబునఁ గృతార్థుండ
నైతినని చెప్పి, నిజగతివిశేషంబుల నమ్మండూకపతి మూర్ధంబుమీఁదం
జిందులాడ, నతండు మెచ్చుచుండఁ గ్రమక్రమంబున నాకప్పల నన్నింటిని
మెక్కి యొక్కనాఁడు,—

129


క.

తలపోసి యబ్భుజంగము
జలపాదుని మ్రింగి యన్యసరసికి నేగన్
వలయునని, యపుడు మెల్లన
పలుకఁగ విని యాతఁ డేమి భావించి తనన్.

130


క.

పుడమిన్ విప్రునిశాపముఁ
గడచితి మండూక ముండఁగా నంచును నే
నుడుగుల నుడుగక యున్నా
నడరఁగనని, మఱియుఁ జెప్ప నాతఁడు మదిలోన్.

131


వ.

విశ్వసించియుండ నతని భక్షించి చనియెం గావున, బహూపా
యమ్ముల శత్రునిశ్శేషంబు సేయుట నీతిమార్గంబని యెఱింగించి, చిరంజీవి
యోదేవా! భాగ్యసంపన్నుండ వఖిలవిభవమ్ములు నిన్నుం బొందెనని
వెండియు నిట్లనియె.

132


సీ.

విద్వత్కవులయందు విశ్రాణంబును,
                    బ్రత్యర్ధివిభులందు బాహుబలము,
శరణాగతులయందుఁ గరుణాకటాక్షంబు,
                    నృపకార్యములయందు నీతిగరిమ,