పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/92

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అరివలె నుండుట క్రియలం, బరమాప్తస్ఫూర్తిఁ దేటపఱుచుట యదివో
యరయ సుహృల్లక్షణమో, కరటా నీయందుఁ దోఁచెఁ గద యీసరణుల్.

66


క.

మతిశంక లేక మూషక, పతి వివరము వెడలి కరటకపరివృఢుతో న
ప్రతిమగుణరత్నఖనితో, గతకల్మషుతోడఁ జెలిమికాఁడై యుండెన్.

67


వ.

అట్లు కృతసఖ్యుండగు నయ్యుందురుముఖ్యుండు విందుఁ బెట్టి వీడ్కొలిపిన దరి
ద్రునకు నిధానంబునుంబోలె సుహృల్లాభంబుఁ గనుట కలరుచు సింహవ్యాఘ్ర
గజగవయగండభేరుండప్రముఖజంతువహనంబులగు గహనంబుల విశ్రమించి
సారంబులగు సస్యాహారంబులఁ దెచ్చి యిచ్చుచు నచ్చిక బుచ్చిక లడరఁ గొంతకాలం
బుఁ గడపి యొక్కనాఁ డావాయసపరివృఢుండు హిరణ్యకు డాయంబోయి
యిట్లనియె.

68


ఉ.

పోయెద నిప్పు డన్యవనభూమికిఁ బ్రాణసఖా ప్రమోదసం
ఛాయక నన్నుఁ బంపు మనిన న్విని ధైర్యము వ్రస్సి వెల్వెలం
బోయినమోముతోడ బలిధుక్ప్రవరుఁ బురుషార్థసంగ్రహో
పాయు సుహృద్విధేయుఁ గని పల్కె హిరణ్యకుఁ డార్తచిత్తుఁడై.

69


చ.

ఇట నను డించి యేమికత మేఁగెదు చెప్పఁగదన్న యెట్టు లె
క్కటిని జరింతు నన్న తృటికాలము ని న్నెడఁబాసియున్కి దు
ర్ఘటము గదన్న నాకడను గల్గినయీధృతి యెందుఁ బోయె ని
ప్పటికి విచిత్ర మన్న విధి భద్రవిరోధి గదన్న యెన్నఁగాన్.

70


చ.

అని కనుదోయి చెమ్మగిల నాకృతి విస్మృతి నొంద మూర్ఛవో
యినబలిభుగ్విభుండు చలియించి గరుద్యద్యజనానిలంబునన్
దనువిడిఁదేర్చి యోపరమధార్మిక ని న్నెడఁబాసిపోవ నే
ర్తునె సకలార్థసిద్ధఫలదుండని చూతుఁ గదయ్య ని న్నిటన్.

71


ఉ.

నాపయనంబు విన్ము కరుణావరుణాలయ వృత్రశాత్రవా
సాపురకాననోర్వి నొకసారసరోవర మొప్పు నందు వి
ద్యాపరమేష్ఠి మంధరకుఁ డన్కమఠాగ్రణి మత్సఖుండు సౌ
ఖ్యాపవహుఁ డుండు నప్పరహితార్ధిఁ గనుంగొని సాదరంబునన్.

72


ఉ.

అతఁడు నాకుఁ బ్రీతివశుఁడై యొనరించు ననూనమీనమాం
సాతిభుజక్రియ న్బలసమగ్రుఁడనై చనుదెంతుఁ గ్రమ్మఱన్
నీతిధురీణ న న్పనుపు నీ వనఁ గన్నుల శోకబాష్పధా
రాతతు లుప్పతిల్లఁగ హిరణ్యకుఁ డాతనిఁ జూచి యిట్లనున్.

73