పుట:నీలాసుందరి.pdf/7

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నీలాసుందరి

“ఓహోయ్ పెసగూ " అంటూ ఝాంకారంగా వొకమాట వినపడగా “ఆ, యెందుకోయ్ డబ్బూ?" అని ధీమాగా యెదురడుగుతూనే ఠకీమని ఆగిపోయి, ఆవిసురికి పడిపోకుండా, గజగమనానికి తోడు వయ్యారంగా వూపుకుంటున్న రెండు చేతులతోనూ నెత్తిమీది గంప పట్టుకుని, ఆబరువుకి లేనడుము జవజవలాడిపోతుండగా వూగీసలాడుతూ నుంచుని, మాట వచ్చిన దిక్కుకి పక్క వాటుగా చురుకూచురుకూ చూసింది. భద్ర. ఎటుచూసినా, మహాసముద్రంలాగ కనుచూపు మేర, మోకాలిలోతున వొకటే చెంగలిబీడు. ఆ బీటిలో అక్కడో మామిడీ, అక్కడో నేరేడూ, అక్కడో చింతా, అక్కడో తుమ్మా, అక్కడో తాడీ చెదిరి చెదిరివున్నాయి.

అక్కడక్కడచిన్నా పెద్దాతుప్పలుకూడా కొన్ని వున్నాయి. మరకతమణులు పరిచినట్టున్న ఆ బీట్లో, అక్కడక్కడ సముద్రపు కెరటాలమీది నురగల్లాగ పెద్ద పెద్ద ఆలమందలు. ఆ మందలోనుంచి యీ మందలోకీ, యీ మందలోనుంచి మరో మందలోకీ రంకెలు వేసుకుంటూ మదించిన ఆబోతులు తిరుగుతున్నాయి. దూరందూరంగాపోతున్న ఆవులను అదలించి గుంపుల్లోకి చేరుస్తూ, అక్కడక్కడ గొల్లపిల్ల కాయలు రకరకాల ఆట లాడుకుంటున్నారు.