పుట:నీతి రత్నాకరము.pdf/77

ఈ పుట ఆమోదించబడ్డది

74

నీతిరత్నాకరము

వారితో నా మేకడకుం బోయి యిందిరా దేవీ ! మీకుమారిక రాధిక భరతపురమునఁ గాళికాసన్నిధిని గుశలముగా నున్నది. ఈవార్తఁ దెలుపవచ్చితిమని హిత వాక్కులు వినిపించిన నాలకించి మరలమరల నడిగి కాహళుం బిలిచి యీక్షణమ భరత పురమునకుం బోవలయును. శిబిక నాయత్తపఱుపుమనఁగా నందుఁ గల పెద్ద లందఱు తల్లీ ! నీవీ సమయమున నచటికిం బోవుట పాడి గాదు. మే మందఱము పోయి తెల్ల వాఱునంతదనుక నందుండి రాధికా రక్షణమునం దప్రమత్తులమై 'పాతాళుని జూచుచుం దుము శ్రీనివాసదాసుగారు రాఁగా వ్యవహార మెట్లు చేయఁ దగునో యట్లే జరపుదురు. మీ రిపుడు వెళ్లి రాధికం దీసికొని వచ్చిన వ్యవహారము తాఱుమాఱగును. తల్లీ! మామాటల నవధరింపుఁడు. త్వరపడకుఁడు. భగవంతుఁ డిబాలుర రూపమున నాకుమారిని గాపాడెను. కావున నిఁక నారాధికకు నించు కంతయు భయము కలుగకయుండ మేమెల్ల నిపుడే పోయి కాపాడెదమని తెలియఁ జెప్పిరి.

ఇందిరా దేవి ధీమంతురాలు. పెద్దలవలన సకలధర్మములు నెఱింగినది. శీలవతులలో మేటియని పేరు గాంచినది కావున వారిమాటలు న్యాయసమ్మతములగుట నంగీకరించి వారిని బ్రార్ధించి భరతపురమునకుఁ బంపెను. కాహళుడు గృహ రక్షణమునకై సోదరు నియోగించి భరతపురమునకుం బెక్కండ్రను బెద్దలను బంపి తాను జాలంధర పురమార్గమునఁ గొంత దూర మరిగి దాసుగారి రాకకై యెదురుచూచుచుండెను. ఇందిరా దేవి ప్రభాతము కాగా లేచి స్నానము చేసి పరమేశ్వరిం బూజించి యిట్టియెడరు తప్పుట నీ యనుగ్రహముననే