పుట:నీతి రత్నాకరము.pdf/55

ఈ పుట ఆమోదించబడ్డది

54

నీతిరత్నాకరము

తయు సంసిద్ధముగ నుండుటెఱింగెను. కుంతలుఁడు వివాహోచితపదార్దములం దీసికొనిపోవ సిద్దముగ నుండెను. తక్కినపరివారము యథాసంకేతముగ నుండిరి తొలిదినమే భరతపురమునకుం బోయి కుంతలుఁడు ప్రయత్న మంతయు సిద్ధమయ్యెనని యర్చకులకుం జెప్పి సాయంకాలమే పూజాదులు ముగించి మీరిండ్లకుం బోవలయునని చెప్పివచ్చెను. నాలుగుడబ్బుల కాశించి వా రట్లు చేయఁబూని యుండిరి. శిబిక సంసిద్ధమయ్యెను. సంకేతస్థలములన్నియు నాయాయిసేవకులకుఁ జూపఁబడియెను. వారంద ఱాసమయమునకు వచ్చి సిద్ధముగనుందుమని పల్కిరి. తనకు వలయువస్తువులు మూలికలు సంసిద్ధముగనుండఁ బాతాళుఁడు కార్యభారవ్యగ్రమనస్కుఁడై యుండెను. ఎపుడు సాయంకాలమగునా యని వేచియుండెను.

ఆనాడు రాధిక శుక్రవారమగుట సభ్యంగస్నాన మొనరించి పూజాదు లొనర్చి యిష్టదైవముల నారాధించి ముత్తైదువులకు వాడుక చొప్పున నిచ్చుదానముల నిచ్చి సాయంకాలమునకు ముందే మరల సువాసిసులు రాఁగా వారిం గూడి దేవీభజనము చేసి వీణా నాదమున నంబను సువాసినీ బృందమును సంతోషింపఁ జేసెను. ఆనాడు విశేషించి శ్రమపడియెను. తల్లి 'రాధికా! ఏల యింత పాటుపడియెదవు ? నేఁ డేమి విశేషమని ప్రశ్నించెను. రాధిక తల్లీ! నాతండ్రి గారు జలంధరీదేవ్యుత్సవమునకుం బోయిరికదా, నేఁ డందు మహోత్సవము సాగును. శుక్రవారమౌట మఱింతవిశేషముగ నర్చనలు సాగును. కావున వారందు భక్తిపరవశులై యంబ