పుట:నీతి రత్నాకరము.pdf/5

ఈ పుట ఆమోదించబడ్డది

6

నీతిరత్నాకరము

ఆభూమి మానవులను బవిత్రులనుగా నొనరించునని వేదములు తెలుపుచున్నవి. సకలకల్మషముల నదులు హరించుననుట నిక్కము. కల్మషమనగా దేహమాలిన్యమని కొంద ఱర్థము చెప్పుదురు. ప్రవాహోదకముల యందుదయకాలమునకు ముందు స్నానము చేసిన సకల రోగములు నశించునని యాయుర్వేదము తెలుపుచున్నది. దీనినెల్ల నంగీరించియే యున్నారు. పదార్థ విజ్ఞానశాస్త్ర వేత్తలు లక్ష్యలక్షణ పురస్సరముగా దీనిని దృఢ పఱచుచున్నారు. ఆరోగ్యముకలిగినపుడు. మనస్సు పరిశుద్ధముగ నుండుననియు, నది మంచి కార్యములు చేయఁబూనుననియు నార్యులభావము. కావున నదులు పాపములు తొలఁగించుననుట యుక్తియుక్తమే యనవచ్చును.

నదులు సమీపముననున్న దేశములు ధనసంపన్నములుగా నుండుట సాధారణము. ఆదేశములకు నదీమా తృకములని పేరు. తల్లివలె నదులు పయః ప్రధానమున నెల్ల భంగులంబోషించుటంజేసి నదీమాతృకములనుపే రాదేశములకుఁ గలిగె నని పెద్దలందురు. ఆయర్థము యుక్తి కనుకూలముగనే యున్నది. సస్యములకు ఆరోగ్యమునకు నదులు మహోపకారకములను సిద్ధాంతము సర్వజనాంగీకారమును బడసినది. నదుల యిరుదరులకుఁ బరిసరమున నున్న భూములు సారసంతము లయి యుండుట సర్వజనవిదితమగు విషయముగాని మాఱు మూలనుండునది కాదు. ఏయేభాగములనుండియో యొండు మట్టిని దెచ్చి భూములం గప్పును. సస్యములు సమృద్దిగ దానిచే ఫలించును. కర్షకుల కింతకంటే మహోపకారము చేయుటెట్లు? -