పుట:నీతి రత్నాకరము.pdf/40

ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ వీచిక

39

వృక్షము కలదు కదా. దానిమూలముకడ మీరెల్ల నుండుఁడు. లోపలినుండి యా రాధికను దీసికొని మేము వత్తుము. మన మందఱము కలిసి భరతపురమునకుం బోవుదము. ఈనడుమ నీవు వివాహమంత్రములు నేర్చుకొనుము. దానికిం గావలసిన పరికరముల సిధ్ధము చేయించి యుంచుము. అపుడు తడవుకోన రాదుసుమీ. నీవీ కార్యమునఁ గడుజాగరూకుఁడవై యుండుము. నా కింతకంటె మేలుచేయు సమయమురాదని నమ్ముము. అని నచ్చఁ జెప్పెను.

కుంతలుఁ డామాటలకు మదిజంకుచు నిట్లు హిత ముపదేశించెను. మిత్రమా! నీవన్నింటను జతురుండవని నే నెఱుంగుదును. కాని శ్రీనివాసదాసు ధనవంతుఁడు. మంచి వాఁడని విఖ్యాతిం గాంచిన వాఁడు. ఎవరినోటనుగూడ దాసు ధర్మాత్ముఁడన్న మాటయే వెడలును. ఇందిరాదేవి పతివ్రతాశిరోమణి. రాధికయు సంగీతసాహిత్వచిత్రకళలయం దసమానపాండిత్యమత్యల్పవయస్సుననే సంపాదించినది. ఆనాఁటీసభలో నా కన్యకకుఁ గలసంగీతజ్ఞానమును మెచ్చుకొననివాఁ రొక్కఁడైనఁ గలఁడే. అట్టికన్యకను దొంగిలికొని పోయి భరతపుర దేవాలయమునఁ బెండ్లి చేసికొనుట యసంగత కార్యము. అది సాగుట కష్టము. సాగినదనియే యనుకొందము. మరల మన మీలోకమున మనఁగలమా! మర్యాదగల యేమానవుఁడైన మనలఁ జేరనిచ్చునా! కావున నీ కార్యము మానుట మంచిది. అంతియ గాదు. రాధికకు నీకును హస్తిమశకాంతరము గలదు. ఆమె రూపవతియగుటయే గాక విదుషీమణి. నీవో నిరక్షరకుక్షివి.