పుట:నారాయణీయము.pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13


"రుచిరకంపిత కుండలమండలః సుచిర మీశ ననర్తిథ పన్నగే
 అమరతాడిత దుందుభి సుందరం వియతి గాయతి దైవత యావతే"

అని దీని మూఁడుపాదములందు మూఁడువిధములగు ననుప్రాసములు గలవు. అందుల కనువుగఁ దెలుఁగు పద్యమునఁ గూడ నప్రయత్నసిద్ధములగు శబ్దాలంకారములు పడి, యెంతయు సహజములట్లు విలసిల్లుచున్నవి. మూలమునఁ గృష్ణునకుఁ గల కర్తృత్వము అనువాదమున నిలింప కాంతలకుఁ గూర్పఁబడినది. ఇంద్రియభేదమే కాని మూలమందలి భావ మిసుమంతయు బీఱువోకుండఁ జూపఁబడెను. ఇది యసామాన్యవిషయము. మొత్తముమీఁద నీ యనువాదము మూలమునకుఁ బ్రతిబింబమై సంస్కృతభాషావిత్త్వము కలుగని యాంధ్రుల కందఱకు నారాయణ భట్టపాదుని ప్రతిభా వ్యుత్పత్తులను గరతలామలక మొనర్పఁజాలియున్నది. మూలముతో సరిచూచుచు నిట్లు పరిశీలింప నానందము కలుగవచ్చును గాని గ్రంథవిస్తరము కాకతప్పదని యా పరిశీలన మింతతో విడిచి, కథాంశములు, రీతి రసగుణాదులఁ గూర్చి యారని యానందింతము.

ఇందలి కథలన్నియు వరుసగా భాగవతమందలివే యని మొదటఁ జెప్పితిని, ఆ కథ లిందు రేఖామాత్రముగా నుండునే కాని భాగవతమందువలె విస్తృతములుకావు. అట్లని యందలి యే కథయు స్పృశింపక విడువబడలేదు. కావుననే యీ గ్రంథమును భాగవత సారమనియుఁ బెద్దలందురు. కర్దముఁడు దేవహూతిని బెండ్లాడుట మొదలుకొని, కపిలుఁడు పుట్టి, తల్లి యగు దేవహూతికి భక్తిజ్ఞానయోగములు బోధించుటదాఁకఁ గల కథాంశము ఆంధ్ర భాగవతమున సుమారు మూఁడువందల పద్యములలోఁ జెప్పఁబడఁగా- ఇందు కపిలావతార మొక పద్య దశకమునను కపిలోపదేశ మింకొక దశకమునను జెప్పఁబడినది. అట్లని ప్రధానాంశములు విడువఁ బడక , సూత్రప్రాయముగఁ జెప్పఁబడినవే కాని వర్ణనములవలె విడువఁబడినవి లేవనియే యనవచ్చును. అందీ యువదేశఘట్టమున ప్రతి పద్యము నాల్గవ పాదము నేకాకారముగా నుండుటచే నపూర్వ రామణీయకము కలిగినది. విషయము సాంఖ్యయోగమైనను సంగ్రహముగా సొగసుగా నిట్లు చెప్పుట కా మహాకవి కా శాస్త్రమున నెంత యనుభవముండవలెను! దానిని తెలుఁగు భాషలో స్వయంభువమువలె ననువదించుట కెంత శక్తి యుండవలెను! దీక్షితకవిమౌళి వశ్యవాక్కున కిది నికషోపలము,