పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/50

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 12


రజనీచరచరిత్రదుర్దమకర్దమసంక్షాళన బాచరించుచు సింధునదీసవిధంబున
వివిధమణిప్రభాశుభావహం బై ప్రభావతి యనం బరఁగిన విశ్వకర్మనిర్మితం
బగుపురంబుఁ గరంబు తిరం బగునెయ్యంబు తియ్యంబున నరయచు నుండె
నందలి సౌభాగ్యం బెట్టి దనిన.

19


పురవర్ణనము

సీ.

వేదండతతు లెల్లఁ జౌదంతికొదమలు హరు లెల్ల నుచ్చైశ్శ్రవాన్వయము
లరదంబు లెల్ల దివ్యవిమాననిభములు భటు లెల్ల సింహడింభకసమాను
లంగన లెల్ల బుష్పాస్త్రునస్త్రంబులు విప్రు లెల్లరు వేదవిత్తనిధులు
క్షత్త్రియు లెల్లరు శరభశౌర్యాఢ్యులు కోమటు లెల్లరుఁ గోటిపతులు
శూద్రు లెల్లరు నిరవధిభద్రవశులు, తోఁట లన్నియు వేలుపుఁదోఁటలట్ల
దీర్ఘికలు దేవతాపురిదీర్ఘికాభి, రామములు దానవేంద్రుపురంబునందు.

20


గీ.

పద్మరాగాశఘటిత మౌ పఱపునేల, నంటు మెఱసిన ప్రహ్లాదునగరు మెఱయు
నీలనిర్మిత మగుచు నుత్తాలగరుడ, వాహనారూఢుఁ డగునీలవర్ణుఁ బోలి.

21


గీ.

మేటితలుపులమీలనోన్మీలనములఁ, బ్రజలులోడింద వెలిఁబర్వఁబరఁగుఁబురము
నిదురవోవుట లయమును నిదురలేమి, సృష్టియును గాఁగ విలసిల్లు స్రష్టఁ బోలి.

22


చ.

తరళసుధాకరప్రభలు దార్కొనుమాత్రఁ గరంగి చంద్రకాం
తరచితసౌధముల్ గురియు తజ్జలధారలఁ బొంగుచూపు ని
ర్జరనది యప్సరోగణకుచద్వయనిర్దయమర్దనక్రియా
స్ఫురితతరంగభంగదశ వోవఁగఁ బున్నమరేలఁ గ్రాలుచున్.

23


క.

పురగోపురవరముకురో, దరమునఁ దమనీడఁ జూచి దైవతముగ్ధో
త్కర మితరకాంత [1]లంచు, న్మురిపెంబున సారెసారె ముచ్చటలాడున్.

24


గీ.

గంధబంధురసింధురస్కంధపీఠి, మీఁదఁ దత్కరనిక్షిప్తమేదురోరు
పాంసువలయంబు చెన్నొందుఁ బర్వతాగ్ర, తలసుఖాసీనమేఘసందర్భ మనఁగ.

25


క.

హరులు సుదర్శనకరములు, పరిపంథిమదాపహములు బహువిధలక్ష్మీ
స్ఫురణాపరిణాహంబులు, పురితేజులు శార్ఙ్గపాణిఁ బోలుం జాలన్.

26


గీ.

విశ్వకర్మవినిర్మాణవేళఁ గూర్చు, నమరయానంబులకుఁ బడియచ్చు లనఁగఁ
జారుచామీకరాలేపసంప్రదాయ, కవచితము లైనరథములు గలవు పురిని.

27


క.

భటులు రణరంగలీలా, సటు లుద్భటసింహనాదనారదఘోషో
త్కటులు మృగీమదచర్చో, త్కటు లప్పుటభేదనమునఁ దనరుదు రెపుడున్.

28
  1. లలకు