పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/491

ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

గనుఁగొని పురంధ్రీ! నీపతి ఘనగుణాఢ్యుఁ
డఖిలధనములు భార్యాద్వయంబుఁ గలిగి
యరుగుదెంచి భవన్మోహభరమువలన
మమ్ముఁ బుత్తెంచెఁ దడ వేల? మగువ! రమ్ము.

153


వ.

అను తద్వాక్యంబులు విని లజ్జించి ప్రత్యుత్తరంబులు దోఁచక పతి
గుణంబులు దలపోయుచు నున్నసమయంబున బంధువర్గంబు పతి
పిలువనంపినం బోవనియది పదియేనుజన్మంబులు వాయసియై
జన్మించునని బోధించి డోలిక నెక్కించిన నేను భర్తృగృహంబున కేఁగి.

154


క.

కనుఁగొంటి వస్త్రరాసులు
ఘనసారకురంగనాభి కాశ్మీరజచం
దనరాసులు (ధనరాసులు)
నినరాసులువోలె మణులు నిరుగడ మెఱయన్.

155


వ.

అప్పు డెదుర్కొని మద్భర్త రాక్షసి రాజనందనలచేఁ బాదంబు లొత్తించి
తనకు మామయగు రా జిచ్చిన సొమ్ములు, రాక్షసీదత్తదివ్యరత్నంబులుం
జూపి యీ సొమ్మునకు [1]నీకే యాధిపత్యంబులని యన్నియు నప్పన
చేసి నన్ను మన్నించె; సపత్నులు చూడ నేకశయ్య విహరించె. ఇట్లు
కొంతకాలంబు దాఁటిన నేను గాలాంతరంబున నరకం బనుభవించి
యీరూపంబున జనియించితి. ఇంక వేయిమాఱులు తిర్యగ్యోనుల
జనియింపవలసినయది. తనజీవితంబులు పతియెడ దాఁచెనేని బహు
నరకంబు లనుభవించునని కాష్ఠకీటంబు పలికిన నే నిట్లంటి.

156


క.

నినుఁ జూచిన దయ పుట్టెడి
ఘనతరమగు నిట్టిపాతకం బేసుకృతం
బునఁ జను నాసుకృతం బిపు
డొనరించి జగంబు లెఱుఁగ నొసఁగుదు నీకున్.

157


వ.

అనినఁ గాష్ఠకీటం బిట్లనియె.

158


క.

ఇలయెల్ల దాన మిచ్చినఁ
దొలఁగఁదు నాపాతకంబు దూరతరంబై
తొలఁగును హరివాసరమున
వెలసిన సుకృతంబువలన విమలచరిత్రా!

159
  1. "మీకే" వ్రాతప్రతి