పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/301

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మ యానతిచే సనత్కుమారుఁడు శ్రీహరి దివ్యవిమానమును యాదవాద్రికి తెచ్చుట

వ.

అంత సనత్కుమారునిం జూచి విరించి యిట్లనియె.

70


సీ.

కలదు సహ్యగిరి విఖ్యాతమైనయది పు
                       ణ్యతరం బనాది, తదాకరమున
శ్వేతమృత్తిక విలసిల్లు నచ్చట నీవి
                       మానంబు నిల్పు మనూనమహిమ
నారాయణపదాబ్జపారాయణుండవై
                       వఱలు శ్రీవైకుంఠవాససౌధ
ముననుండి తానె వచ్చినయది యతిపావ
                       నము, వేదనిందక నళిననేత్ర


తే. గీ.

భక్తి విరహిత, నాస్తిక, భాగవతవి
దూష కాత్యంతదుర్దోషదుష్టమతుల
నీవిమానంబుఁ జూడరానీక భక్తి
నందు వర్తించుమీ కుమారాగ్రగణ్య!

71


వ.

అనిన యంత.

72


తే. గీ.

నవ్యవైభవమున నాసనత్కుమారుఁ
డాదిదేవు, సనాతను, నజు, నగమ్యుఁ
జెంది యుప్పొంగి కనకాద్రిశిఖరసీమ
కరుగుదెంచె నిరంతరాహ్లాదుఁ డగుచు.

73


క.

అనుపమదివ్యవిమానము
మననపరుం డాసనత్కుమారుఁడు గొనిరాఁ
గనకాచలశృంగంబుల
నినకోటిసహస్రకాంతు లెల్లెడ మెఱసెన్.

74


సీ.

అప్సరఃకాంతలు నమరులు ననిమేష
                       నేత్రసాఫల్య మెన్నిక వహించి
హరివిమానముఁ జూచి హర్షాశ్రుపూర్ణత
                       మ్రొక్కిరి నవ్యప్రమోదలీల
ఆవిమానమునకు నగ్రంబునను వాహ
                       నారూఢు లగుచు నింద్రాదిదివజ
గంధర్వకిన్నరఖచరవిద్యాధర
                       సాధ్యులు నలువంక సవటి గొలువ