పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/175

ఈ పుట ఆమోదించబడ్డది

తప్పటడుగులువేసిన సందర్భాలు లేకపోలేదు. ఆర్షవిజ్ఞానం దృష్ట్యా సంసారిగా జీవిస్తూ ఉపవాసరహితుడై వుంటూ కూడా వివిధ ఆధ్యాత్మికశక్తులు పొందవచ్చు నని చెప్పవలసివుంటుంది. సంసారి అయివుండి నిత్యభోక్త అయివుండీ కూడా నియమితాచారం కలవాడై నారాయణనామస్మరణ చేస్తూ నిత్యోపవాసిగా నెగడొందవచ్చునని వశిష్ఠునిచేత నరసింహకవి యీక్రిందివిధంగా చెప్పించాడు.

"నియమంబున స్వభార్యనియతుండనై యుక్త
        కాలంబుననె రతికేలి సలిపి
యుండుట మఱి నాకు యుక్తంబు బ్రహ్మచా
       రిత్వంబు జగము వర్ణించి పొగడ
గాధిపుత్రుఁడు కమలాధిపభక్తిని
      ష్ఠాపరాయణుఁడు ప్రశస్తి గాంచి
జాత్యశ్రయనిమిత్తసత్కర్మములు పూని
      వీతదోషముగ నైవేద్య మొసఁగి
యదియు ననిషేధకాలంబునందుఁ గృష్ణ
యనుచు గోవింద యనుచుఁ బరాత్మ యనుచుఁ
బ్రతికబళమును నుడువుచుఁ బరిభుజించె
వాసి నటుగాన నిత్యోపవాసి యయ్యె."

(నార. 181. పు. 165. ప.)

ఉపవాస, నిరుపవాసస్థితుల గురించి ఆగమవాఙ్మయావిష్కరణకు పూర్వకాలంలోనే పెక్కువివాదాలు జరిగినట్లు కనిపిస్తున్నది. తిథిఫలనిర్ణయాదివిషయాలను వర్ణిస్తూ సూతుడు మునులకు వివరించిన సందర్భంలో "అనేకాగమవిరోధంబులు నైన నేమి? బ్రాహ్మణులు వివాదించిన నేమి? ద్వాదశ్యుపవాసంబునుం ద్రయోదశిపారణయుం జేయవలయు" (నార. 193. పు. 20. వ.) అని విస్పష్టంగా ద్వాదశ్యుపవాసాన్ని త్రయోదశిపారాయణను నియతంగా ఒనరించాలని పేర్కొన్నాడు.

మనకు మామూలుగా చాతుర్మాస్యవ్రతం గురించి అందరికీ తెలిసినవిషయమే. అయితే చాతుర్మాస్యవ్రతం వలెనే శ్రావణశుద్ధవిదియ మొదలు నాలుగుమాసాలపాటు అంటే మార్గశిరశుద్ధవిదియవరకూ శూన్యశయనవ్రతాన్ని సంశుద్ధితో విష్ణువు నర్చిస్తారని వాసుదేవుడు రుక్మాంగదునికి అతని పూర్వజన్మవృత్తాంతం తెలిపిన సందర్భంలో వివరించడం జరిగింది. (నార. 223. పు. 167. ప.)

బహుభార్యాత్వం అంత్యంతప్రాచీనకాలంనుంచీ వున్నది. దశరథునికాలంనుంచే కాక అంతకుముందు కృతయుగంనుంచే బహుభార్యాత్వం వున్నదని