పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/161

ఈ పుట ఆమోదించబడ్డది

మహాభారతోక్తి ననుసరించి ప్రజాపతులుసైతం 21 సంఖ్యకే పరిమితమై కనిపిస్తున్నారు. బ్రహ్మ, స్థాణు, మనువు, దక్షుడు, భృగువు, ధర్ముడు, యముడు, మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, పరమేష్ఠి, సూర్యుడు, సోముడు, కర్దముడు, క్రోధుడు, అర్వాకుడు, ప్రీతుడు.

గణపతి లీలావిశేషాలుగా ఏకవింశల్లీల లున్నట్లు గణపతిపురాణం పేర్కొంటున్నది. వీటన్నిటికి మూలంగా శ్రీమహావిష్ణువు ఏకవింశతి అవతారాలను తాల్చి తన మాయావిలసనాన్ని విరాజిల్లచేయడమేనని కనిపిస్తున్నది. మామూలుగా మనం దశావతారాలనే విష్ణ్వవతారాలుగా భావిస్తాంకాని శతాధికంగా అవతారా లున్నట్లు వేదప్రమాణంగానే వున్నట్లు గతంలో పేర్కొనడం జరిగింది. అయితే విశిష్టదశావతారాలకు భిన్నంగా, ఆ దశావతారాలతోసహా, మరికొన్ని అవతారాలను కలిపి మహావిష్ణువు అవతారాలు ఏకవింశతిసంఖ్యకు పరిమితాలైనట్లు వైష్ణవీయగ్రంథాలలో కనిపిస్తున్నది. విధాత, యజ్ఞవరాహ, నారద, నరనారాయణ, కపిలసిద్ధ, దత్తాత్రేయ, యజ్ఞ, ఉరుక్రమ, (ఋషభ), పృధుచక్రవర్తి, మత్స్య, కూర్మ, ధన్వంతరీ, మోహినీ, నృసింహ, వామన, భార్గవ, (పరశురామ), వ్యాస, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, బుద్ధ, లేదా కల్కి అవతారాలుగా యీ 21 ని పేర్కొనడం జరుగుతున్నది. బుద్ధ, కల్కి, అవతారాలకు మారుగా కుమారస్వామి అవతారాన్ని సైతం వొక అవతారంగా పేర్కొన్న గ్రంథాలు లేకపోలేదు. కేవలం విష్ణ్వవతారాలేకాక అటు గణపతిలీలలూ, చివరికి శివదీక్షలుసైతం 21 సంఖ్యకు పరిమితమవడం చూస్తే మొత్తంమీద శ్రీమహావిష్ణువు తాల్చిన 21 అవతారాల వైశిష్ట్యం ప్రసిద్దిలోకి వచ్చిన రోజుల్లో కేవలం విష్ణుపరంగానేకాక, అటు శివపరంగాసైతం వేదోక్తమైన హరిహరాభేదం లక్ష్యంగా యీ 21 సంఖ్యకు పరిమితంచేసి అటు విష్ణ్వర్చనలను యిటు శివదీక్షలను ప్రాచీను లేర్పరచినట్లు కనిపిస్తున్నది. ఈ దృష్ట్యానే అటు విష్ణ్వర్చనలోనూ, యిటు శివార్చనలోనూ దీపారాధన చేయడంలో విడివిడిగా 21 వత్తులతో దీపాలుగల కుందెను పెట్టి వెలిగించి యేకవింశద్దీపజ్యోతులతో ఆరాధన చేసేసంప్రదాయం ఊభయమతాల్లోనూ ఒకనొకవైశిష్ట్యంతో అత్యంతప్రాచీనకాలంనుంచీ నేటివరకూ కూడా ఆచరణలోవున్నది.

వర్ణనలు - ప్రత్యేకత

నరసింహకవి నారదీయపురాణంలో కొన్నికొన్నిసందర్భాలలో ఒకానొకవైశిష్ట్యంకల వర్ణనావిశేషాలను ప్రదర్శించాడు. తులసీహరివాసరాది మహత్వవర్ణనలోనూ ధర్మకేతుడనే రాజు భక్తితో చేసే నారయణార్చనావిధానం గురించి