పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/130

ఈ పుట ఆమోదించబడ్డది

దానును హరిభక్తి దర్శన కీర్తనంబుల హృదయంబు ప్రసన్నంబైన ఆ విష్ణుభక్తపదాంభోజసంగపూతజలంబు దృష్టిపథంబున నున్నఁ బానంబు చేసి యా రాక్షసుండు వైకుంఠతద్భక్తభుక్తశిష్టపాత్రక్షాళనతోయపరికీర్ణాన్నకబళంబులు భుజించి గృధ్రంబులు దాను జాతిస్మరత్వంబు నొంది వైవస్వతుఁ డానతి యిచ్చిన క్రమంబుఁ దలంచుకొని విష్ణుభక్తాంఘ్రితీర్థంబున ముక్తియె ఫలియించె" (నార. 139. పు. 213. ప.) అని వైవస్వతుడు ఆనతియిచ్చిన క్రమాన్ని తలచుకొన్నాడని పేర్కొనడంద్వారా వరాహ నరసింహాది అవతారాలు వైవస్వతమన్వంతరంలోనే జరిగినట్లు నరసింహకవి అభిప్రాయపడినట్లు కనిపిస్తున్నది. ఏకాదశీమాహాత్మ్యాన్ని వర్ణిస్తూ "వైమనస్య మందె వైనస్వతుం డంతఁ! జిత్రగుప్తలేఖ్య పత్రలిఖిత! దురితపుణ్య లిపుడు తుడుపులు వడిరి తద్విష్ణుదివసమహిమ వింతకాదె!" (నార. 197. పు. 39. ప.) అని వైవస్వతుని తరువాతనే నారదీయపురాణరచన జరిగిందన్నభావాన్ని వ్యత్యస్తంగా వ్యక్తీకరించాడు. గతంలో పురాణాలచరిత్రను గురించి అవతరణను గురించి చర్చించిన సందర్భంగా వివిధకల్పాలలో విభిన్నపురాణాలు అవతరించినట్లు ప్రాచీను లభిప్రాయపడిన విషయం అభివ్యక్తం చేయబడింది. కాగా నరసింహకవి దృక్పథంతో ప్రస్తుత వైవస్వతమనువు ఆనతి గురించి విస్పష్టంగా, ఇదమిత్థంగా, చతుర్యుగాలపరంగా మనం యేమీ చెప్పలేము. వైవస్వతమన్వంతరంలోనే యిప్పటికి 26 చతుర్యుగాలు నడచి 27 వ చతుర్యుగంలో చివరిదైన కలియుగం నడుస్తున్నది. ఈ దృష్ట్యా వేలకొలది అవతారాలను పేర్కొన్న వేదవాఙ్మయాన్ని ప్రమాణంగా తీసుకొన్నప్పుడు, దశావతారాలు కేవలం పరిమితాలై యుగకాలనిర్ణయాలలో ఒక విస్పష్టమైన అభిప్రాయానికి రావడానికి నిక్కచ్చిగా తోడ్పడుతాయని మన మేమీ చెప్పలేము.

నిజానికి నారదీయపురాణం యెపుడో కృతయుగంలోనే (ఏ కృతయుగంలోనో చెప్పలేము) వ్రాయబడిందని, లేదా నారదప్రోక్తమైందని, నారదీయపురాణంవల్లనే మనకు సుస్పష్టం అవుతున్నది. రామగాథ భవిష్యత్తులో జరుగబోతున్నదని, భవిష్యద్వాణిగా యీ కృతిలో పేర్కొనబడడమే కాక, ఆ రూపంగా రామగాథకు పూర్వమే యీ కృతి రచింపబడిందని యీ క్రిందిపద్యంవల్లనే స్పష్టమవుతున్నది.

"రాఘవుని యాజ్ఞ సౌమిత్రి రణమునందు
నింద్రజిత్తునిఁ దునుమ నా యింద్రజిత్తుఁ
డతిసహాయంబు తానెయై యవనియందుఁ
గలిపురుషుఁ బాయక చరించుఁ గలుషవృత్తి."

(నార. 173. పు. 126. ప.)