పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



వీళ్లెవరు, వీళ్లకూ నాకూ ఏమిటీ సంబంధం అన్పించింది. కానీ వీళ్లందరూ నా తెలుగు తోబుట్టువులు. మా అందరిలో ప్రవహిస్తోంది తెలుగు రక్తమే. అందుకే ఇంతమంది తమ ఆత్మీయుడిని చూడాలన్నంత ఆత్రంగా వచ్చారు.

సూర్యా, దేశం గురించి, తెలుంగుజాతి గురించి నువ్వు చెబితే మేమందరమూ వినాలని మనసుపడుతున్నాం..” మసన్న కోరాడు.

“లంకకు కొద్ది దూరంలోనే భారతదేశం ఉంది. అక్కడ రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణలలో మొత్తంగా తెలుంగే మాట్లాడతారు. ఇతర రాష్ట్రాలలో కూడా తెలుంగు మాట్లాడేవాళ్లు చాలానే ఉన్నారు. మనది మొత్తం తొమ్మిది కోట్ల గుంపు. లంకలో మీవి ఎన్నీ కుటుంబాలో తెలియదు, ఎంత మంది ఉండారో తెలియదు. కానీ ఇతర దేశాలలో చూస్తే మన తెలుంగు జాతిది చాలా పెద్ద గుంపు.. కాస్త సరళంగా వాళ్లకి అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించా.

“మన గుంపులో రాజపక్ష లాంటి వాళ్లు ఉన్నారా? ఎవరో ప్రశ్న వేశారు

ఎందుకు లేరు. మన తెలుంగు వారు భారతదేశ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా చేసిన వాళ్లు ఉన్నారు.

“మన తలైవా ఎన్టీఆర్‌ అనీ అక్కడెక్కడో ఉండాడని ఇక్కడికి వచ్చి మా జీవితాలని మారుస్తాడని మా తాత చెప్పేవాడు. ఆ ఎన్టీఆర్‌ ను చూడకుండానే మా తాత పోయాడు. ఆ ఎన్టీఆర్‌ ఉండాడా? మరో ప్రశ్న

ఆ యువకుడు ముప్పై ఏళ్ల వాడు. “నీ పేరేమిటి”

సుబ్బడు”

సుబ్బడూ ఆ మహానటుడు, మహా తలైవా మరణించి చాలా ఏళ్లవుతోంది. ఇప్పుడున్న తలైవాలతో మీ గురించి చెబుతా.

“దేశంలో మనోళ్లు ఈనాటికీ ఏల్‌ నాళ్ల పెళ్లిళ్లు చేసుకుంటున్నారా, ఓ మధ్య వయసు స్త్రీ ప్రశ్నించింది.

“అమ్మా మీ పేరేమిటి?

“ముత్తుమారి '

“ఇక్కడ మీ పెళ్లిళ్లు అలా జరిగేనా అమ్మా

“ముందర అలా జరిగేవి. పెళ్లికొడుకు పెల్లికూతురింటికి వచ్చేవాడు. గుడారాలు వేసేవాళ్లం. తాళికట్టడం, నల్ల పూసలు వేసుకోవడం అంతా ఉందేది. అందరూ చేరి తినేది, తాగేది.కసాటాలు రాసేవారు. ఇప్పుడు అలాంటిది లేదు. సింగలంలోనే కసాటాలు రాస్తున్నారు. బుద్దుడిని కొలుస్తున్నాం కదా పెళ్లి కూడా ఒక్క పూటలో అయిపోతుంది”. కాస్త బాధ పడుతున్నట్టుగా అనిపించింది.

'మరి ఈ వీధి మొదట్లో గణేష్‌ మందిరం కన్పించిందే' వీళ్ల మతం గురించి తెలుసుకోవాలనే ప్రశ్నించాను.

ఎర్రన్న ముందుకు వచ్చాడు. “సూర్యా, అదంతా ఓ పెద్ద కత అవుతాది. మా తాత ముత్తాతలు, వాళ్ల తాతలు అంతా సంచారులే. వారం రోజులు కూడా ఒక్క చోట ఉండేవాళ్లు కాదు. క్రమంగా నాగరికత పెరిగింది. నగరాలు, ఊర్లు పుట్టుకొచ్చాయి. మాకు ఉండడానికి ప్రాంతాలు తగ్గిపోయాయి. గత నలఖై ఏళ్ల నుంచే ఇలా అందరమూ ఓ చోట చేరి ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నాం. మా వాళ్లు మరణించినప్పుడు ఏ స్మశానానికి తీసుకువెళ్లాలో తెలిసేది కాదు. ఎక్కడా మమ్మల్ని అనుమతించేవాళ్లు కాదు. అందుకే చాలా మటుకు బౌద్దానికో, కైస్తవానీకో మారుతున్నాం. కుడాగమా, దీవరగమ్మలలో మేమంతా బుద్దుడిని పూజిస్తున్నాం. పుత్తలం లాంటి చోట్ల ఏసుప్రభువును పూజించే వాళ్లు ఎక్కువ.” అంటే మరణానంతర పరిస్థితికి భయపడి మతం మారుతున్నారు. ఈ భూమ్మీద ఇలాంటి సమస్య మరెవ్వరికైనా ఉంటుందా అనిపించింది. చాలా బాధేసింది. అవేవీ కన్పించకుండా ..

“దేశంలో ఉన్న మనోళ్లకు మీ గురించి ఏమన్నా చెప్పాలా?

“దేశంలో ఉన్న మనోళ్లను ముందు చూడాలని ఉంది, నాకు ఇండియా రావాలని ఉందన్నా? మొదట సుబ్బడు స్పందించాడు.

“మాకు కుర్రు లేదు, బిల్లలు సింగలమే నేరుస్తున్నారు. మన తెలుంగు కుర్రు నేర్పిస్తే బాగుంటాది” మరో అభ్యర్థన.

నిజమే. తెలుగులో మాట్లాడుతున్నారు. కానీ ఆ అక్షరాలు రాయలేరు. కాబట్టి వాళ్ల చరిత్రను రాసిపెట్టుకోలేకపోయారు. చంటి పిల్లాడితో వచ్చింది ఓ పాతికేళ్ల యువతి. ఆ బాబును చూస్తూ ఏం పేరని అడిగాను.

“'వేలుకమల్‌, సింగలం పేరు పెట్టా. మావి తెలుంగు పేర్లని సింగలం వాళ్లు గేలి చేస్తారు. అందుకే బడి మానేశా. ఇప్పుడు కూడా వాళ్ల ఇళ్లల్లోకి రానీవ్వరు. మమ్మల్ని దూరంగా పెడతారు. నా బిడ్డ ఆ కష్టాలు పడకూడదు. అందుకే సింగలం పేరు పెట్టా. సింగలమే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

44