పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు బోధన

సి. వి. క్రిష్ణయ్య 9396514554

చదవడం అంటే ఏమిటి?

చదవడం అంటే ఏమిటి? దేన్ని చదవడం అంటున్నాం? నేర్చుకోవడం అంటే ఏమిటి? దేన్ని నేర్చుకోవడం అంటున్నాం? చదవడం నేర్చుకోవడం రెండూ ఒకటేనా? ఈ విషయాల గురించి స్పష్టంగా తెలుసుకొందాం. మొదట విద్యార్థులనూ, టీచర్లనూ అడిగి వారేమి చెబుతారో విందాం.

ఒక అమ్మాయిని పలకరిద్దాం.

అమ్మాయీ! నీ పేరేమిటి? ఏ తరగతి చదువుతున్నావు?

“నా పేరు లత. పదోతరగతి చదువుతున్నాను!”

లతా! నీ చేతిలో ఏదో పుస్తకం ఉంది. ఏమిచేస్తున్నావు?

“రేపు పరీక్షలు, చదువుకొంటున్నాను”

చదవడం అంటే ఏమిటి?

“చదవడం అంటే అక్షరాలు గుర్తించి, పదాలు వాక్యాలు చదవడం. పుస్తకంలో పాఠం చదవడం”

“నువ్వు పాఠం చదువుతున్నట్లు లేదు. నీ చేతిలో నోట్‌బుక్‌ ఉంది”

“అవును. ప్రశ్నలకు జవాబులు నేర్చుకొంటున్నాను!

నేర్చుకోవడం అంటే ఏమిటి?

“నేర్చుకోవడం అంటే ఒకటికి పదిసార్లు చదివి కంఠస్థం చేసి గుర్తుపెట్టుకోవడం”

మరిచిపోతే ఎలా!

“మరిచిపోతుంటాం. మళ్లీ పరీక్షలప్పుడు చదివి గుర్తు చేసుకొంటూ ఉంటాం. పరీక్షల వరకు గుర్తుంటే చాలు”

“పరీక్షలు రాస్తావు. మార్కులు వస్తాయి. పాసైపోతావు. ఆ తర్వాత మరిచిపోతే మార్ములు కూడా పోవాలి గదా!”

“అదెలా! నేను కష్టపడి నేర్చుకొని పరీక్షల్లో రాసాను కదా”

“మార్కులు వేసేది జ్ఞానానికి కదా! జ్ఞానం మరిచిపోరు కదా! నువ్వు కంఠస్థంచేయకుండా పాఠం అర్థం చేసుకొని సొంతమాటల్లో రాస్తే జ్ఞానం సంపాదించుకొంటావు గదా!”

“పాఠం చదివి అర్ధం చేసుకోవడం కష్టం. పాఠంలో ప్రశ్నలుంటాయి. వాటికి టిచర్లు జవాబులు చెబుతారు. లేకపోతే గైడ్లు ఉంటాయి. జవాబులు నేర్చుకొనీ పరీక్షల్లో రాస్తే మంచి మార్కులు వస్తాయి. సొంతంగా రాస్తే ఫుల్‌ మార్కులు వేయరు”

ఇదీ సంగతి. పిల్లల దృష్టిలో చదవడం అంటే అక్షరాలు చదవడం. నేర్చుకోవడం అంటే జవాబులు కంఠస్థం చేయడం.

పాఠాలు అర్ధం చేసుకోవడం కష్టం. సొంత మాటల్లో రాస్తే “ఫుల్‌ మార్కులు” వేయరు. ఇది పిల్లల అభిప్రాయం. మరి టీచర్లు ఏమి చెబుతారో విందాం.

సార్‌ మీరు ఏ సబ్దక్టు చెబుతారు? -

“నేను సోషల్‌ అసిస్టెంటును. సోషల్‌ చెబుతాను.

“పిల్లలకు పాఠాలు చెబుతారా, ప్రశ్నలకు జవాబులు చెబుతారా”

“రెండూను. పాఠాలు చెబుతాను, ప్రశ్నలకు జవాబులూ చెబుతాను.”

“ప్రశ్నలకు జెవాబులు తెలుసుకొని రాయాల్సింది పిల్లలు గదా! మీరెలా జవాబులు చెబుతారు?”

“వాళ్లు అర్ధం చేసుకోలేరు”

“వాళ్లకు అర్ధమయ్యేటట్లు మీరు పాఠం చెప్పాలిగదా!”

“మేం పాఠం చెబుతాం. అర్థం చేసుకొనే వాళ్లు చేసుకొంటారు. చేసుకోలేని వాళ్లు చేసుకోలేరు. వారికి నోట్స్‌ ఇస్తున్నాంగా! అందరికీ అర్ధమయ్యేటట్లు చెప్పాలంటే సిలబస్‌ పూర్తిగాదు. అందుకే నోట్స్‌ ఇస్తున్నాము.”

అది టీచర్ల ఉద్దేశం.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చదవడం అంటే ఏమిటి? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. లిపి చదవడం, విషయం చదవడం. రెండూ ఒకటి కాదు. లిపినేర్చుకొంటాం. అది ఒక నైపుణ్యం, అది ఒక విద్య. ప్రాథమిక తరగతుల్లో లిపి నేర్చుకోవడం పూర్తవుతుంది. దీనీ అధారంగా పై తరగతుల్లో విషయం చదువుతారు. అంటే అర్దం చేసుకుంటారు. చదవడం అంటే అర్ధం చేసుకోవడం. విషయం ఇదీ అని తెలుసుకోవడం. చదవడం అంటే ప్రశ్నలకు జవాబులు నేర్చుకోవడం కాదు. చదవడం అంటే కంఠస్థం చేయడం కాదు.

అక్షరాలతో సంబంధం లేకుండా మనమందరం ఈ ప్రపంచాన్ని నిరంతరం చదువుతూ ఉంటాం. అంటే అర్థం చేసుకొంటూ ఉంటాం. అర్ధంచేసుకొనే శక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అది నేర్చుకొనేది కాదు. అది పుట్టుకతోనే మనలో దాగి ఉంటుంది. అది ఉపయోగించక పోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు.

అర్ధం చేసుకోడానికి ఒక పద్ధతి ఉంది. ఒక క్రమం ఉంది. అదేమిటో తెలుసుకొందాం.

ఈ సృష్టిలో ప్రతిదీ అద్భుతమే. రహస్యమే. ఆకాశం, నక్షత్రాలు సూర్యుడు, చంద్రుడు, భూమి, నిప్పు, నీరు, చెట్లు, రకరకాల జీవులు వీటి గురించి తెలుసుకోడానికి మానవ జాతి వేల సంవత్సరాలుగా కృషిచేస్తూ ఉంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు తమ జీవితాలను ధారబోసి ఎన్నో విషయాలు తెలుసుకొన్నారు. వారి కృషి ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న జీవన విలాసాలు.

వేల సంవత్సరాలుగా ఎంతో విజ్ఞానం పోగువడింది. ఈవిజ్ఞానం దాచి పెట్టేది కాదు. తరం నుండి తరానీకి అందించాలి. ఈ విజ్ఞానం మనుషుల మెదళ్లలో చేరితేనే అది మరింతగా అఖివృద్ది అవుతుంది. అందుకోసమే ఈ స్మూళ్లూ, టీచర్లూ పాఠ్యపుస్తకాలు.

పిల్లల వయస్సును బట్టి తరగతులను బట్టి వాళ్లు ఎలాంటి విషయాలు ఎంత నేర్చుకోగలరొ అంత విజ్ఞానాన్ని కూర్చి పాఠ్యపుస్తకాలు తయారు చేస్తారు. వాటినీ చదివి పిల్లలు అర్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఉపాధ్యాయులు సహకరిస్తారు. పిల్లలు

తెలుగుజాతి పత్రిక 'అమ్మనుడీ * నవంబరు-2020

21