పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/667

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

601


లోకంబులో నొకలోలలోచనకు
నేకభర్తయెకాక, యీవధూమణికి
నేవురుభర్తలు! ఇదిదూషితంబు;
భావింప దీనిని జంధకి యండ్రు ;
అట్టిదానిని విగతాంబరఁ జేసి
గట్టిగాఁదెచ్చినఁ గలుషంబులేదు. "
అనుచుఁ గర్ణుండు దా నావికర్ణునకు
ననుపమప్రతిభాషలాడు నా వేళ
పెరిమ దుశ్శాసనుఁబిలిచి [1]యిట్లనియె:
“పరవీరవిజయుల పాండునందనుల
వలువలు, ద్రౌపదీవస్త్రసంఘమును
ఒలువుము భయమంద కుగ్రంబుతోడ. "
ననిపంచినను వాఁడు నట్లకాకనుచుఁ
జనుదెంచినను, బాండుజననాథసుతులు
అలఘు మాయాద్యూతమందున నోడి
బలిమియేమియులేక పై వస్త్రతతులు
మునుబెట్టి యాసభమ్రోల నుండుటయుఁ,
జెనసి యుద్ధతి దుస్స సేనుండు ద్రుపద-
రాజతనూభవ రాజితాంబరము
రాజసంబున నొల్వ రమణ డగ్గఱిన,

ద్రౌపదీమానసంరక్షణము

నావేళ ద్రౌపది యతిభీతినొంది
భావజజనకునిఁ బద్మలోచనునిఁ
గరిరాజవరదునిఁ గారుణ్యనిధిని
బరమాత్ము నచ్యుతు భక్తవత్సలుని

  1. దుర్యోధనుఁడు కర్తఆధ్యాహార్యము.