పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/543

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

477


నిసుముగానేసిన, నింద్రుండు మఱియు
వెస నద్రిశిఖరముల్ విఱిచి వైచినను,
వజ్రాస్త్రముల వాని వాసవి దునుమ,
వజ్రితో నాకాశవాణి యిట్లనియె:
"విడుమింక దేవేంద్ర, వీరాదిమునులు
జడియరు నీచేత; సకలయత్నములఁ
గాలు నీయగ్నిచే ఖాండవవనము
వాలాయ' మనుబ్రహ్మవాక్యంబు గలదు.
ఈయగ్నిభయము మున్నెఱిఁగి, తక్షకుఁడు
పోయెఁ గురుక్షేత్రమున కిందు లేఁడు;
ఈసంకటవుఁగోటి నీఁగెడుపాటి
చేసూటిగలమేటి చెడఁడు కిరీటి."
అనుటయు, దేవేంద్రుఁ డమరులుఁ దాను
ఘనయుతుండై యేఁగెఁ గలహంబుమాని.
నలినంత మయుఁడునా నవ్విశ్వకర్మ
చెలువకై ఖాండవస్థలి నుండుఁ గాన
దరలి వహ్నికిఁగాక తక్షకగృహము
చొరఁబాఱి వెడలక చుట్టునుబెట్టి
సుడిగాడ్పుతో నందుఁజొచ్చి పావకుఁడు
తడవుచుఁ బోనీక తన్నాక్రమింప,
బలిమి నయ్యగ్నిలోఁ బడలేక మయుఁడు
బలభేదిసుతు నిట్లుప్రస్తుతిచేసె :
"కావవే యర్జున! కరుణావిధేయ,
పావకశిఖలోనఁ బడియున్నవాఁడఁ;
దక్ష[1]కాదులకును దాత నన్నెఱుగు;
లక్షింపఁ బెద్దకాలమునాఁటివాఁడ;

  1. రాక్షసులకు (మూ)