పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/496

ఈ పుట ఆమోదించబడ్డది

430

ద్విపద భారతము


[1]గడు నురుగుపట్టి గంగాప్రవాహంబు (?)
వెడలినగతిఁ గ్రంతవీధులనడవఁ,
గాంతలు ద్రౌపదీకల్యాణమనుచు
నంతంతఁ గర్ణసౌఖ్యముగఁ బాడఁగను,
గ్రందుగ నాతపత్త్రంబులనీడ
మందమందానంద మాధుర్యలీలఁ
జనుదేర, నెదురునేసలుచల్లి ద్రుపద-
తనయుఁడెదుర్కొని తగురీతి వారి
విభుమందిరమునఁ బ్రవేశింపఁ జేయఁ
ద్రిభువనంబులు వేడ్కఁదేలె నద్దినము.
అంతఁ, బాంచాలుండు హర్షించి వారి
వింతగా మధుపర్కవిధిఁ బూజచేసి,
కన్యకావరణంబు గావించి, పిదపఁ
గన్యధారాపూర్వకము [2] నీయ, నృపులు
మంగళసూత్రముల్ మక్కువముడిచి,
తొంగలించినవేడ్కఁ, దూర్యముల్ మ్రోయ
ధౌమ్యుండు కదిసి మంత్రంబులు చెప్ప
రమ్యవైఖరిఁ దలఁబ్రాలొప్పఁబోసి,
కరమున విమలరక్షాబంధనములఁ
దిరమొప్ప నేవురుఁ దెఱవకు ముడిచి,
హోమవేదిక యెక్కి యుచితమార్గముల
ధీమంతు లగ్ని ప్రతిష్ఠ గావించి,
కన్య నేవురుఁగరగ్రహణంబు చేసి,
ధన్యతఁబులకించి తగనుత్సహించి,
హోమంబులన్నియు నొప్పొరఁదీర్చి,
హేమంబు ద్విజులకు నిచ్చిరి తనియ

  1. నూరువట్టి, అనియుండఁదగునేమో!
  2. సేయ, (మూ )