పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/426

ఈ పుట ఆమోదించబడ్డది

360

ద్విపద భారతము


నిండి పాఱుచునున్న నేతికాలువలు,
దండిగానొప్పారు దధిసరస్సులును,
బిండివంటలు బెక్కుపృథుశాకతతులుఁ
గండచక్కరలతో గడుననేకములు
చాలంగఁగురిసిన, సంయమిచూచి
మేలని యాకుఱ్ఱిమేనెల్ల దువ్వి,
మేయంగఁబొమ్మని మృదురీతి ననిచి,
యాయవనీశ్వరు నటకు రాఁబనిచి,
వినుతింపరాకుండ విందువెట్టుటయుఁ,
దన సేనలును దానుఁ దనరి కౌశికుడు
భుజియించి విస్మయపుంజితుండగుచు,
భజన నరుంధతీపతిఁ జూచిపలికె :
ముదితాత్మ, నాకు నీ మొదవునీవయ్య!
మొదవులెన్నైనను మొగి దీనికంటె
ఘనవయోవిభవంబు గలిగినవానిఁ
దనియంగ నిచ్చెదఁ దాపసారాధ్య!"
అనినఎ గౌశికునకిట్లనియె వశిష్ఠు:
"విను మేను నీకుఱ్ఱవిడువంగఁజాల;
దీనినొక్కటిఁగావఁ దీరదు నాకుఁ;
బూని పెక్కైనను బ్రోవంగఁగలనె!
సర్వకృత్యంబులు సరి దీనివలన
నుర్వీశ, యెప్పుడే నొదవును నాకుఁ;
గావున నీయావు గడచి యోరాజ,
యేవైనఁ బ్రార్థింపు మిచ్చెదనీకు. ”
అనిన విశ్వామిత్రుఁడలుక నిట్లనియె:
"మునివని నేనిట్లు మోమాటసేయ
వినయమించుక లేక విఱ్ఱవీఁగెదవు!
నినువంటి మౌనులునెఱి నెందులేరు!