పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/390

ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము


శ్రీయుత వాగ్జాల సిద్ధివిశాల,
న్యాయనూతనచోడ, నరపయచౌడ,
పంచమ వేదప్రబంధ సత్కీర్తి
మించినసత్యధర్మీ! చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పదొణఁగె .
ఆవిధంబున దైత్యుఁడణఁగినపిదప
భావిత హర్షసంభ్రమములు దోపఁ
గొడుకులనీక్షించి కుంతి యిట్లనియె:
"కడలేనిఈకాన ఘనులార, మనకు
జరియింప నేటికి? జనపదంబులకు
వరయుక్తిఁబోవలె వనము వెల్వడుఁడు."
అనిన నయ్యేగురు నౌఁగాక యనుచు
జననీసమేతులై సమ్ముదంబునను
అచ్చోటుచాలించి యరుగుచో, వెంట
వచ్చుదానవిఁజూచి వాయుజుండనియె:
"ఏలవచ్చెదు బాల! యీవేళ కొలువు
చాలుఁ; జయ్యనఁబొమ్ము సదనంబుకడకు.
అన్నఁజంపినపగ యాత్మలోనిడిన
విన్ను నమ్ముట యెట్లు! నీవు రాక్షసివి;
కాదని, నీరూపుగై [1]కొనఁ జనునె!
పోదువు మీయన్నపోయినకడకు."
అనిన హిడింబ దైన్యంబునం గుంతి
గనుఁగొని గదిసి యేకతమ యిట్లనియె:

  1. కొని చనకు (మూ)