పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/352

ఈ పుట ఆమోదించబడ్డది

286

ద్విపద భారతము


శకునవేదుల శిల్పశాస్త్రకోవిదులఁ
బ్రకటించి విశ్వకర్మలఁ గూర్పవలయుఁ ;
బవడంపుబోదెలుఁ బసిండికంబములు
నవరత్నవేదులు నవ్య పీఠములు
బచ్చెనగోడలుఁ బట్టుమేల్కట్లు
బచ్చఱాళులకప్పు బాగుగావలయు ;
నరనాథ, లగ్ననిర్ణయము సేయింపు ;
కరిపురంబెల్ల సింగారింపఁ బంపు ;
నృపపుంగవుల నెల్ల నెమ్మిరప్పింపు. "
అనుటయు, ధృతరాష్ట్రుఁడట్ల కాక నుచు,
ఘనునంపెఁ బురము సింగారింప విదురు.
అంత, నవ్విదురునియాజ్ఞక్రమమున
వింతగాఁ బౌరులు వేడ్కనప్పురిని
బసిఁడిమేడలయిండ్లు పసనారఁ దోమి,
వెస వెండిమేడలు వేగఁబుల్గడిగి,
సున్నంపుమేడలు సొంపురాఁబూసి,
క్రన్నన భువనేశ్వరములు భూషించి,
మాడుగులట్టళ్లుమణికవాటములుఁ
గ్రీడాగృహములు మిక్కిలిమెఱుఁగువెట్టి,
ముత్తెంపుగోపురంబులు ధవళించి,
క్రొత్తగా బంగారుకుండలెక్కించి,
మిసిమియుప్పరిగల మీఁదికోణములఁ
బసిఁడికోలలుపాఁతి పడగలుగట్టి,
గోడలయెడలఁ గుంకుమమప్పళించి,
వాడలఁ గస్తూరి వాసిల్లనలికి,
రంగైన బహునవరత్నముల్ మెఱయ
ముంగిళ్ల ముత్యాలమ్రుగ్గులు దీర్చి,