పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/333

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

267


సందడి దొలఁగంగ జడియుచుఁ గదిసి
యందందుఁ బటువేత్రహస్తులు గొలువ,
నుడుగనిమదధార నుజ్జ్వలంబగుచుఁ
బొడవైన కొండలఁబోలుకుంభినులుఁ
గడిఁదివజ్రముకంటె గాడ్పునకంటె
బెడిదమై జవములఁ బేర్చునశ్వములు
సరవిమైఁ జూపట్టి సమదాళికమరి
యిరుదెస మొత్తమై యిమ్ములఁ గొలువ,
మెఱుఁగారు తొడవుల మించులేఁదొడల
నిఱుపేదనడుముల నిండి క్రిక్కిఱిసి,
కడుమించుకుచములఁ గంబుకంఠముల
సుడిబోలునాభుల సొబగుఁ బల్కులను
గమలాకరంబుల కాంతిఁగీడ్పఱచు
విమలాసనంబుల వెడఁదకన్గవలఁ
గుటిలాలకంబులఁ గొమరుదీపించి,
పటువైన మరుచేతిబాణంబులనఁగఁ
బొలుపారి విలసిల్లు పుష్పకోమలులు
లలితోజ్జ్వలాకార లావణ్యవతులు
కరకంకణంబులు కదిసి ఘోషింప
సరసత్వమునఁ జేరి చామరలిడఁగ,
దివ్యభూషణ మణిదీప్తులు వెలుఁగ,
భవ్యపుష్పంబులు భవ్యగంధములు,
గ్రమమునధరియించి, కనకాసనమున
నమరేంద్రువైభవంబలరఁ గూర్చున్న,
నుపకార మీవేళ నొదవు నాకనుచు
ద్రుపదునొద్దకుఁబోయి దుఃఖంబుద్రవ్వి :
"చెలికాఁడ, నీవాఁడఁ జేపట్టునన్ను;
నలఁగివచ్చితిఁ జూడు నాకుటుంబమ్ము!