పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/321

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

255


సిగ్గులు నగవులుఁ జెనకుచూపులును,
నగ్గలికలు నేర్పు లలసయానములు,
మెలపులు గరిమలు మెచ్చకుండుటలుఁ
జెలుములు బలములుఁ జిడిముడిపడఁగఁ,
గుచములుఁ గచములుఁ గునిసియాడంగఁ,
బ్రచురమై రత్నహారము లొయ్యఁ దూలఁ,
గంగణఝణఝణత్కారంబు మెఱయ,
నంకించి యందియ లల్లన మొరయ,
విడువక చిఱునవ్వు వెన్నలగాయ,
నడు మసియాడంగ నడతెంచి వచ్చి,
యోడక నిలిచి యయ్యోగికట్టెదురఁ
బాడిన, శృంగారభావంబు పుట్టి
యుల్లంబు నుల్లంబు నొక్కటియైన,
ఝల్లన మదనరసంబు నెట్టవిసి
ధారాప్రవాహమై తపసికి వెడలి,
యూరక శరముపై నొలికి రెండయ్యె.
అందు నేనును నొక్కయాఁడుబిడ్డయును
ఇందువంశాధీశ, యెలమిఁ బుట్టితిమి.
ఆయెడ మాతండ్రి యచ్చోటు వాసి
పోయె; దేవస్త్రీయుఁ బోయె నద్దివికి.
అంత, వేటాడుచు నట వచ్చివచ్చి
శంతనుం డేమున్న చందంబు చూచి
కొని తెచ్చి పెనుచుచోఁ, గొంతకాలమున
కనఘుండు మాతండ్రి యట మమ్ము వెదకి
చనుదెంచి 'వీరు నాసంతాన' మనుచు
మనుజేంద్రునకుఁ జెప్పి మముఁ గొనిపోయి,
కృపుఁడనుపేరును గృపియనుపేరు
[1] నృప, మాకు నొనరించి నెమ్మి రక్షింప

  1. నృపుఁడు మా కొనరించి (మూ)