పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/285

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

219


కడపటఁ దనుబాసెఁ గడు[1]ఖేద మొదవఁ
బుడమి నాబ్రదుకంత భూజనుల్ నవ్వ.
రాజనుమాత్రుండె! రసికుఁ డాపాండు
రాజు; మావంశవర్ధనుఁ; డేడుగడయు.
అటువంటితమ్ముని నడవిమధ్యమునఁ
గటకటా! పోఁజేయఁగా విధి చేసె.
హా పాండుభూవర! హా గుణాధార!
హా పుణ్యఫలసార! యబ్ధిగంభీర!
అన్న! న న్నెవ్వ రిం కర్థి నొడలంటి
యెన్న నోమెడువార లెక్కడ గలరు!
నాపట్టుఁగొమ్మయ్యు, నాకన్నులయ్యు,
నాపుణ్యపదమయ్యు, నాతేజమయ్యు,
నాప్రతాపంబయ్యు, నాగర్వమయ్యు,
నాప్రాపు దాపునై నన్ను రక్షించి,
మన్నించి, తలిదండ్రి మఱపించి, నీవు
న న్నెట్లు పాసితి ననుఁగన్నతండ్రి!”
అని చాలభీతుఁడై, యంతఃపురమున
వనితలు వారింప వగచుచునుండె.
ఉన్నంత, ధర్మరా జుదయించువార్త
యన్నిదిక్కుల మ్రోసె; నట్లు మ్రోయుటయు,

కౌరవజననము


వ్యాసునివరమున వనిత గాంధారి
భాసురగర్భంబు పండ్రెండునెలలు :
మోచి, వేసరి: "యింక మోవ నే నోప;
నేచందమున మోతు నిది చాలవ్రేఁగు!

  1. ముదంబొదవ (మూ)