పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/194

ఈ పుట ఆమోదించబడ్డది

130

ద్విపద భారతము.


గనుఁగొని, యాశ్చర్యకలితుఁడై మున్ను
మనముననెఱుఁగనిమాడ్కి నిట్లనియె:
"ఇందీవరాక్షి, నీవెవ్వరిదాన !
వెందుండివచ్చితి విచ్చటికిపుడు ?
వెస నీకుఁ బే రేమి ? వీరలెవ్వారు ?
మసలక చెప్పు మామననుమోదింప.”
అనిన, భార్గవినవ్వి యతనికిట్లనియె;
“విను, మఱచి తె నన్ను విజ్ఞానివయ్యు !;
శుక్రుండుమాతండ్రి; సురుచిర తేజ (?)
విక్రాంత, నా పేరు విను దేవయాని ;
పరిచారికలు నాకుఁ బరఁగవీరెల్ల ;
సొరిది నీవన [1]శోభఁ జూడవచ్చితిమి.
మున్ను నే నూతిలో మొఱవెట్టుచుండఁ
గ్రన్ననఁ గడఁక నాకడకేఁగుదెంచి,
నావలచేయి యున్నతి వడిఁ బట్టి,
వే వెడలించితి విపినకూపంబు.
కావున, నదియపో కరుణావిధేయ,
భావింప నాకయ్యెఁ బాణిపీడనము.
నాఁటనుండియు నిన్ను నాటినకూర్మి
వాటమైయున్నది వదలింపరామి.
ఈకాంత [2]లిందఱు నెలమిసేవింప
నీకాంతనయ్యెద నెలమిఁగైకొమ్ము."
అనిన, యయాతి [3]శంకాయత్తుఁడగుచు
మనమున ధైర్యంబు మఱువెట్టిపలికె:
"ఓముగ్థ, యీమాట లొనఁగూడవెందు ;
నేమురాజన్యుల ; మీవుబ్రాహ్మణివి ;

  1. కేళి.
  2. లిద్దఱు.
  3. కామ్యకచిత్తుడగుచు. (మూ)