పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/215

ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

203

"ఎవ్వఁడొకో వీఁడు హితబుద్ధి మఱచి
క్రొవ్వునఁ దలసూపెఁ గురుసేనయెదుట ?
నరుఁ డన రాదు నానావిధంబులను
సుర రాజుఁ బోలుభాసురమూర్తి యితఁడు.
తొడరి కౌరవసేనతోడ మార్కొనిన
జడియక విపినంబు శరణంబు కాదె!"
అనుటయు భీష్ముఁ డయ్యర్ధంబుఁ దెలిసి
యను వొప్పఁ బలికె ద్రోణాచార్యుతోడ
"ఎడపక రిపుకోటి కెడ మైనఠావుఁ
గడచి వచ్చితి మింకఁ గలకలం బేల ?
ఒక్కఁడు రానిమ్ము యుద్ధంబు సేయఁ
బెక్కురీతుల సేన పెరిఁగి రా నిమ్ము.
అమితసత్త్వముఁ జూప నను వైనవేళ
సమరంబు సేయుఁడు, శంకింప నేల ? "
అనిన ద్రోణాచార్యుఁ డాత్మలోఁ బాండు
తనయులసమయంబు దాఁటెఁ బొ మ్మనుచు
నానందమును బొంది యడ్డంబు లేక
సేనలఁ గలయ వీక్షించి యిట్లనియె: