పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము.

ఆరీతిఁ బాండపు లతివతో గూడి
ఘోరాటవులలోనఁ గుశలు లై తిరిగి,
బహుమునీంద్రుల చేత బహుపురాణములు
బహుతీర్థములఁ గ్రుంకి పరిపాటి వినుచు,
నెలమిఁ బండ్రెండవయేఁడు నిండుటయు
వల నొప్ప యమునిచే వాంఛితంబుగను
వరముఁ గైకొని, వేడ్క వసుధపైఁ దమ్ము
నొరు లెఱుంగక యుండ నొకయేఁడు గడప
నారాధనము చేసి యముని వీడ్కొల్పి,
తా రొక్కచో డాఁగఁ దలపోసి యపుడు
విమలమనస్కు లౌవిప్రపుంగవులు
తమవెంట నగ్ని హోత్రములతో రాఁగ
నామహాపుణ్యుల కపు డిట్టు లనిరి:
“ఓమహాత్మకులార, యోపుణ్యులార,
ఓమహీసురులార, యుగ్రాటవులకు
మామీఁదఁ గృప గల్గి మముఁ గూడి వచ్చి
యలవి సేయఁగ రానియలజళ్ల కోర్చి
కలసి యుండితి రింత కాలంబుదనుక ;
నింక గోప్యము గాఁగ నేఁడాది మాకు
శంకింప కొక చోట జరపంగ వలయు.