పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/166

ఈ పుట ఆమోదించబడ్డది

52

ద్విపద భారతము.



నడు రేయి గంధర్వనాధు లేకతమ
కడగిఁ కైదువు లేక ఖండించి వైచి
కరములుఁ బదములు ఘనమస్తకమును
గర మర్థితో వానికడుపులోఁ దూర్చి
విపరీతగతి మత్స్య విభుఁడు శోకింప
నుపకీచకులఁ జంపి రొకనిఁ బోనీక.
ఆనృపాలుఁడు మీకు సహితుండు గాన
వాని నెఱిగి చెప్ప వలసి చెప్పితిమి.
వెదకెద మింకఁ బాండవులం
గౌరవేశ్వర మమ్ముఁ గరుణించి యనుపు"
మనవుడు నౌఁగాక యని సుయోధనుఁడు,
పనిగొన వారి నప్పటికిఁ బో ననిపి
తడవుగాఁ జింతించి తనమంత్రివరులఁ
దడయక వీక్షించి తగ వేది పలికె:
"ఎలమిఁ బాండవులకు నియ్యేటితోడఁ
దలకొన్న సమయంబు తగ నిండఁ గలదు;
నిండకమున్నె మున్నిటియట్ల వారి
నుండఁ జేయుట కార్య ముగ్రాటవులను,
కాకున్న రాజ్యభాగంబుఁ దెమ్మనుచుఁ
జేకొని జగడంబు సేయు చుండుదురు.