పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరుకులున్న ఏదేని పేటిక పై తప్పుడు చిహ్నమును వేయుట.

487. సరుకులతో నింపిఉన్న ఏదేని పెట్టె బంగీ, లేదా ఇతర పేటికయందు లేని సరుకులు ఉన్నవనియు అందున్న సరుకులు లేవనియు, లేక ఆ పేటికలోని సరుకుల స్వభావము లేక నాణ్యతకు వేరగు స్వభావము లేక నాణ్యత కలవిగ ఒక పబ్లికు సేవకునినై నను ఎవరేని ఇతర వ్యక్తి నై నను విశ్వసింపజేయుటకు తగినట్లు వీలుకలిగించు రీతిలో అట్టి పెట్టె, బంగీ, లేక ఇతర పేటిక పై తప్పుడు చిహ్నమును వేయనతడెవరైనను, కపటమునకు గురిచేయు ఉద్దేశము, లేకుండ తాను వ్యవహరించినట్లు రుజువు చేసిననే తప్ప, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

అట్టి తప్పుడు చిహ్నమును దేనినై నను ఉపయోగించినందుకు శిక్ష

488. పై కడపటి పరిచ్ఛేదము ద్వారా నిషేధింపబడినట్టి ఏదేని రీతిలో అట్టి తప్పుడు చిహ్నమును దేనినై నను ఉపయోగించు నతడెవరైనను కపటమునకు గురిచేయు ఉద్దేశము లేకుండ తాను వ్యవహరించునట్లు రుజువు చేసిన నేతప్ప, అట్టి పరిచ్ఛేదమును ఉల్లంఘించి అపరాధమును చేసియుండిన ఎట్లో అట్లే శిక్షింపబడును.

హాని కలుగ జేయవలెనను ఉద్దేశముతో స్వామ్య చిహ్నము విషయమున అంతః క్షేపము.

489. ఎవరేని వ్యక్తికి హాని కలిగించు ఉద్దేశముతో గాని, తద్వారా హాని కలిగించగలనని ఎరిగియుండిగాని ఏదేని స్వామ్య చిహ్నమును తొలగించు, నాశనము చేయు, విరూపము చేయు, లేక ఆ చిహ్నమునకు దేనినైనా చేర్చు వారెవరై నను, ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

కరెన్సీ నోట్లను, బ్యాంకు నోట్లను గురించి

కరెన్సీ నోట్లను లేక బ్యాంకు నోట్లను నకిలీగా చేయుట.

489- ఏ. – ఏదేని కరెన్సీ నోటును, లేక బ్యాంకు నోటును నకిలీగా చేయు, లేక నకిలీగా చేయు ప్రక్రియలో ఎరిగియుండియు ఏదేని భాగమును నిర్వర్తించు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము :-- ఈ పరిచ్ఛేదము నిమిత్తము మరియు పరిచ్ఛేదములు 489- బీ, 489-సీ, 489-డీ 489- ఈల నిమిత్తము “బ్యాంకునోటు" అనగా బేరరుకు అభ్యర్ధన పై డబ్బు చెల్లించే పద్ధతిలో ప్రపంచములో ఎచటనై నను బ్యాంకింగ్ వ్యాపారము చేయు ఎవరేని వ్యక్తి చే జారీచేయబడి, లేక ఏదేని రాజ్యపు లేదా సార్వభౌమాధికారపు ప్రాధికారముచేగాని ఫ్రాధికారమును బట్టి గాని జారీ చేయబడి, డబ్బుకు తుల్యమై నదిగానై నను డబ్బుకు మారుగా నైనను ఉపయోగించబడుటకై ఉద్దేశింపబడిన ప్రామిసరీనోటు లేక ఒప్పంద పత్రము అని అర్థము.

కూటరచితమైన లేక నకిలీవైన కరెన్సీ నోట్లను లేక బ్యాంకు నోట్లను అసలై నవిగా ఉపయోగించుట.

489- బీ. ఏదేని కూటరచితమైన, లేక నకిలీదైన కరెన్సీ నోటు లేక బ్యాంకు నోటు కూటరచితమై నదని, లేక నకిలీదని ఎరిగియుండి, లేక అట్లు విశ్వసించుటకు కారణము కలిగియుండి, ఏ ఇతర వ్యక్తి కైనను దానిని విక్రయించు, లేక అతని నుండి కొను లేక తీసికొను, లేక అన్యధా దాని క్రయ విక్రయములు జరుపు లేదా, అసలై నదిగా దానిని ఉపయోగించువారెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

కూటరచితమైన లేక నకిలీవైన కరెన్సీ నోట్లను లేక బ్యాంకు నోట్లను స్వాధీనము నందుంచుకొనుట.

489-సీ. ఏదేని కూటరచితమైన లేక నకిలీదైన కరెన్సీ నోటును, లేక బ్యాంకు నోటును కూటరచితమైనదని లేక నకిలీదని ఎరిగియుండి, లేక అట్లు విశ్వసించుటకు కారణము కలిగియుండి, దానిని అసలైనదిగా ఉపయోగించు ఉద్దేశముతో నై నసు, అది అసలైనదిగ ఉపయోగింపబడవచ్చునను ఉద్దేశముతోనై నను, దానిని స్వాధీనమునందుంచు కొనువారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

కరెన్సీ నోట్లను లేక బ్యాంకు నోట్లను కూట రచన చేయుటకు లేక నకిలీగా చేయుటకు ఉపకరణములను లేక సామగ్రిని తయారుచేయుట లేక వాటిని స్వాధీనమునందుంచు కొనుట.

489-డీ. ఏదేని కరెన్సీ నోటును లేక బ్యాంకు నోటును కూటరచన చేయుటకు లేక నకిలీగా చేయుటకు ఉపయోగింపబడు నిమిత్త మై గాని అట్లు ఉపయోగింపబడుటకు ఉద్దే శింపబడినదని ఎరిగి యుండి లేక అట్లు విశ్వసించుటకు కారణము కలిగియుండిగాని ఏదేని యంత్రపరికరమును ఉపకరణమును, సామాగ్రిని తయారు చేయు, తయారుచేయ ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు లేక కొను, లేక విక్రయించు, లేక వ్యయనము చేయు, లేక స్వాధినము నందుంచుకొనువారెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి , రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.