పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/70

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభిప్రాయభేదము లుండవచ్చును. కాని, నాయభిప్రాయములను గ్రంథాధారములతో తెల్పినాను.

ఈ కృతియందేమైన దొసగులున్న వానిని సింగరాచార్యుల కంటగట్టకుందురని యాశించుచున్నాను.

మరింగంటి కవులపై వచ్చిన వివిధరచనలను లభించినంతవరకు పరిశీలించి యవసరమగు స్థలములందు వానిని పేర్కొని ఆకరము లొసంగినాను. ఆయారచయిత లందరకు అభివాదములు. నల్లగొండకవులను గూర్చిన నావ్యాసములు కొన్ని యీసందర్భమున అవసరమైనవి. వాటికి పుటయడుగున 'శ్రీ' యని గుర్తుంచినాను. పరిష్కరణసమయమున అనుమానములుగా నుండి సవరించుటకు వీలుగాని కొన్నిపద్యములను ఆవిధముగానే ఉంచి ప్రశ్నార్థకచిహ్న ముంచనైనది.

నాయీపరిశీలనమందు అజ్ఞతవల్ల పొరపాట్లు కలుగవచ్చును. సాహిత్యప్రియంభావుకులు వానిని అప్రియములుగా భావింపరని విశ్వసించుచున్నాను.

తెనుగు సారస్వతమున అందు తెలంగాణలోని కవులయందున మరింగంటివారి దొకవిశిష్టశాఖ, ప్రత్యేకపద్ధతి, వీరి ముద్రితాముద్రితసంస్కృతాంధ్రరచనలగూర్చి పరిశ్రమించుట మిక్కిలియవసరమని విన్నవించుచున్నాడను.

"అంతయొ యింతయో తెలిసినట్టి విమర్శకులైన కావ్యసి
ద్ధాంతుల యొత్తిడిం బడి మహాకవి నాఁగటిచాలు దీర్చుఁ గా
లాంతరకీర్తి వృష్టిగతమై చను లాభము నెంచుచున్ లలా
టంత పరూక్షచింతన నటన్మధుభారతి సస్యధారణిన్"

విశ్వనాథ.


30-12-1969,

శ్రీరంగాచార్య.

పాలెము.