పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/4

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రము. ఇట్టి సత్కార్యమునకు సాహిత్యసంస్థలు తలంచిన సాధ్యమగును. గోలకొండ కవుల సంచికవలెనైనా తెలంగాణ కవుల సంచిక యొకటి సిద్ధ మొనర్చుట మిక్కిలి యవసరము. మన ప్రాచీనగ్రంథసంపద నశించిన పిదప విచారించిన నెట్టి ప్రయోజన ముండజాలదు - కొంత కాలముక్రితము – డా॥ బి. రామరాజుగారు ఈ విధముగా వ్రాసినారు:

"తెలుగుదేశ చరిత్రమందువలెనే - తెలుగు సాహిత్య చరిత్రమందును తెలంగాణము ప్రసక్తి తక్కువగా నుండుట సర్వవిదితము. దీనికి కారణము తెలంగాణ మందలి పూర్వకవులగ్రంథములన్నియు సేకరింపబడకపోవుట - సేకరింపబడినవి అనాదరము పాలగుట. కీ॥ శే॥ సురవరం ప్రతాపరెడ్డిగారు - గోలకొండ కవుల సంచిక సంపాదించుట కుండిన యముద్రితగ్రంథములు ఈనాడు తెలంగాణమున లభించుటలేదు. మన మెంత ప్రగతిమార్గమున పయనించుచున్నామో! ఈ తాళపత్రగ్రంథము లంతశీఘ్రగతిని శిథిలమగుచున్నవి. తెలంగాణమున తొలుదొల్త నీయముద్రితగ్రంథములను సేకరించుటకు నడుముగట్టినవారు లక్ష్మణరాయ పరిశోధకమండలివారే. ఆమహాసంస్థ పక్షమున కీర్తిశేషులు దూపాటి వెంకటరమణాచార్యులవారు - వందలకొలది తాళపత్రగ్రంథములను - శాసనములను - నాణెములను సేకరించిరి. కీ॥ శే॥ సురవరం ప్రతాపరెడ్డిగారు రెడ్డి విద్యార్ధి వసతి గృహములో నుంచిన గ్రంథములనే గాక నేను స్వయముగా సేకరించిన రెండువందల లిఖితగ్రంథములను కూడా లక్ష్మణరాయ పరిశోధకమండలి భాండాగారమున చేర్చితిని. పండ్రెండు సంవత్సరముల క్రిందట - నే నాగ్రంథముల పట్టికను సిద్ధము చేసితిని. అదిపోయినదట. నాటినుండి నేటివరకు ఆగ్రంథముల నొకమారైనను పరామర్శించినవారు లేరు. తమ్ము పరామర్శించిన క్రిములకు అవి తమదేహము లర్పించినవి. మనము చేసిన అనాదరణము వలని పరాభవముచే వాని హృదయములు శతచ్ఛిద్రములై గడ్డకట్టుకొని పోయినవి[1]-" ఇది 1961లో వ్రాసిన విషయమైనను - నేటికిని ఎట్టి మార్పులేదు.—

లోకమునకు విజ్ఞానచంద్రికలు ప్రసరింపజేసిన వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావుగారి పేరగల 'పరిశోధకమండలి' దుస్థితియే యిట్లున్న చో -

  1. "మరుగుపడిన మాణిక్యాలు” - “మనవి" - లో.