పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/2

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

శ్లో.

"సీతాలక్ష్మణపూర్ణపార్స్వయుగళం స్మేరానామ్భోరుహమ్
మేఘశ్యాను ముదారబాహుపరిఘం విస్తీర్ణవక్షస్థలమ్
కర్ణాన్తాయతలోచనం కటితటీసంవీతపీతామ్బరమ్
ధ్యాయే౽స్మత్కులభాగధేయచరణం రామంజగత్స్వామినమ్"

(శ్రీరామపాదుకాస్తవము)

1. తెలంగాణలోని ప్రాచీనకవులు-గ్రంథములు-సంస్థానములు-సాహిత్యము:

నల్లగొండ కవులు - రచనలు

సర్వశ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, శేషాద్రి రమణ కవులు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, డా. బిరుదురాజు రామరాజు — మొదలగు వారు ఆంధ్రసారస్వతమున కమూల్యాభరణము లర్పించిన మరింగంటి కవుల గూర్చి సారస్వతలోకమునకు కొంత తెలియపరచినారు — వీరికి నమోవాకములు.

'అచ్చతెనుంగు కబ్బమున కాదిపదంబయి పోల్చు భాగ్యము'ను పొందినది తెలంగాణాభూభాగము. ఈప్రాంతమందు కవులు పండితులు హెచ్చుగా నున్నను చరిత్ర కెక్కని చరితార్థులసంఖ్యయే యధికము. పూర్వకవుల తలపించు శైలిగల వీరిగ్రంథములు చాలభాగము నష్టములైనవి. మరికొన్ని 'ఆలయమందముద్రితములై తెరచాటున డాగియున్న బిబ్బీలవిధాన' గలవు. ముద్రణమైన స్వల్పసంఖ్య గ్రంథములును నేడు లభించుటలేదు.

ఈ ప్రాంతము ౼ విద్యానాథుడు, మల్లినాథ సూరి, శాకల్య మల్లన ౼ మొదలైన సంస్కృతకవిపండితులకే గాక ౼ బమ్మెర పోతన, పాలకురికి సోమనాథుడు, వేములవాడ భీమన, బుద్ధారెడ్డి, పినవీరభద్రుడు ఇత్యాది తెనుగు కవులు; సర్వజ్ఞ సింగభూపాలుని వంటి అలంకారికశిఖామణులు; అప్పకవి, గౌరన వంటి లాక్షణికులు; కొఱవి సత్యనారనవంటి ఆంధ్రకవితాపితామహులును ౼ కలిగి విశేషఖ్యాతి గాంచినది.