పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. లక్ష్మణదేశికులు :- 19 శతాబ్దము ఉత్తరార్థమునం దుండిన యీకవి జనగాం తాలూకాలోని మల్లంపల్లి వాస్తవ్యుడు. కారికావళి, సూక్తిరత్నమాల (ము) రామానుజ అష్టోత్తరశతము మున్నగు నముద్రితరచనలు కొన్ని గలవని డా. రామరాజు గారు ('విజ్ఞాన సర్వస్వము' 6సం. 755, 756 పుటలు) తెలుపుచున్నారు.

11. వేంకట నరసింహాచార్యులు (తృతీయ) :- అనిరుద్ధవిలాసమను యక్షగానమును రచించినాడు (అము). సుమారు 80 సం. క్రిందటివాడు. సింగరాచార్యులవారి శాఖ. ఈ వెంకటనరసింహాచార్యుల పుత్రుడే కనగల్లు నందలి తాళపత్రగ్రంథనిలయ స్థాపకులైరి.

12. శ్రీరంగాచార్యులు: సుమారు 5 సం. క్రిత మీ రంగాచార్యులు పరమపదించినారు. కొన్నివందల తాళపత్రగ్రంథములు సంపాదించి బదిలపరచినారు. వానిలో కొన్ని కృష్ణ దేవరాయాంధ్రభాషానిలయమున కొసంగిరి. గోదావధూటీపరిణయ మొక్కటి మాత్రము వీరి సంపాదకత్వమున ప్రచురింపబడినది. గోదాశతక మొకటి ఈయన రచన గలదు (అము). శ్రీరంగాచార్యులు పరమపదించిన తర్వాత నిరాశ్రయమైన కుటుంబముతో పాటు తాళపత్రగ్రంథములును చెదిరిపోయినవి. వీరు జీవించి యున్నప్పుడు మానాయనగారికి మైత్రీపూర్వకముగా కొన్ని తాళపత్రలిఖితగ్రంథముల నొసంగిరి.

13. వెంకటరామానుజాచార్యులు:- కేశవస్వామి శతకకర్త యగు వేంకటరాఘవాచార్యులవారి పౌత్రులైన వేంకటరాఘవాచార్యుల పుత్రులు. జ్ఞానవయోవృద్ధులైన వీరు కృష్ణాజిల్లా మొఖాసాకలువపూడియం దున్నారు.

కేశవస్వామి శతకమును ముద్రించినది వీరే. జనగాం తాలూకాలోని 'జీడికల్లు' శ్రీరామచంద్రుడు వీరి యభిమానదైవము. 'భల్లాతకక్షేత్ర (జీడికల్లు) మాహాత్మ్యమ'ను అయిదాశ్వాసముల ప్రబంధమును వ్రాసినారు (అము). సుమారు 400 పద్యములకు పైగా గలవు[1]. వారణాసి అచ్యుత రామకవి సురతాణీపరిణయము మొదలైన గ్రంథములు వీరివద్ద యుండెనట. ఇటీవల తుఫానులో నవియన్నియు నష్ట మైనవని తెల్పిరి.

  1. భల్లాతకక్షేత్రమాహాత్మ్యమును ఇటీవల వీరు నాకు పంపినారు (వ్రాతప్రతి).