పుట:దశకుమారచరిత్రము.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

5

స్పష్టముగఁ దెలియును, తిక్కనసోమయాజియంతవానికిఁ గృతి నిచ్చుట కేతన ప్రతిభకు దృష్టాంతము.

[1]కేతన దశకుమారచరిత్రము విజ్ఞానేశ్వరీయము ఆంధ్రభాషాభూషణము అను మూఁడు పుస్తకములు రచించెను. విజ్ఞానేశ్వరీయము యాజ్ఞవల్క్యధర్మశాస్త్రమునకుఁ దెలుఁగుపద్యకావ్యము. ఆంధ్రభాషాభూషణము తెలుగుబాసలోఁ దొలుత వ్రాయఁబడిన వ్యాకరణము. దశకుమారచరిత్రము దండికృతమగు సంస్కృతగద్యకావ్యమునకుఁ దెలుఁగుసేత.

దశకుమారచరిత్రము మూలగ్రంథమునందలి కథలు వర్ణనాంశములలో నించుక తగ్గించి రసోచితములగు కథాభాగములలో నించుక పెంచి వ్రాయఁబడెను. చాలవఱ కిందలిభావములు మూలగ్రంథములోనివె. పండ్రెండవ యాశ్వాసములో మాత్రము కథ మూలముతోఁ బెక్కుచోటుల భిన్నముగా నున్నది. ఉత్తరపీఠిక దండికృతము కాదని కాఁబోలు నిందు విడిచి పెట్టఁబడినది. అపహారవర్మకథలోని బోగముదానికథ మూలగ్రంథముకంటె నిందుఁ దగ్గింపఁబడినది. నిదురించుసుందరి యాకృతియును దెలుఁగున సంక్షేపింపఁబడినది. ఇటులె వర్ణనాంశములలోఁ గేతన చాల సంక్షేపించెను. విశ్రుతునిచరితములోని రాజనీతులు మాత్ర మీ తెలిఁగింపులో విరళము గలవు. మిగిలినచోటులు గళాభిరుచి కడ్డుపడువర్ణనములు లేక గ్రంథమంతయుఁ గథావస్తువునకె ప్రాధాన్య మీయఁబడి మనోహరముగ నున్నది.

  1. ఈ కేతన కాదంబరి పద్య కావ్యము చేసెనని కొంద ఱందురు. ప్రబంధరత్నాకరమున కాదంబరి రచించినది మ్రానయ కేతన యని కలదు గాన నతఁ డిం కొకఁడు.