పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

25


సముదాయాన్ని ప్రయోగించాడు. నేటాలునందలి భారతీయ కార్మికులు అర్ద బానిసలుగా వున్నారు అని మొదటిసారి వ్రాశాడు. రెండోసారి వ్రాసిన జాబులో నేటాలు నందలి భారతీయ కార్మికులు సంపూర్ణ బానిసత్వంలో పడిపోయారు అని వ్రాశాడు నేటాలులో ఏర్పడ్డ ఒక పెద్ద కమీషన్ ఎదుట సాక్ష్యం చెబుతూ గొప్ప యూరోపియన్ కీ. శే. శ్రీ ఎస్కంబ్ కూడా యిదే విషయం చెప్పాడు యిలాంటి అనేక ఉదాహరణలు నేటాలు నందు నివశించే ప్రముఖ ఆంగ్లేయుల వాజ్మూలలనుంచి పేర్కొనవచ్చు యిలాంటి విషయాలు అర్జీల రూపంలో భారత ప్రభుత్వానికి పంపడం జరిగింది. కాని జరగవలసిందేదో జరిగి పోయింది ఏ ఓడ అయితే భారతదేశ కార్మికుల జట్టును నేటాలుకు చేర్చిందో ఆ ఓడయే కూలీలతో బాటు సత్యాగ్రహమనే మహావృక్షపు విత్తనాల్ని కూడా నేటాలుకు చేర్చినట్లయింది

ఈ కార్మికుల్ని నేటాలుకు సంబంధించిన భారతీయ దళారులు ఎలా మోసగించారో, దళారుల మాటలు నమ్మి మనకార్మికులు నేటాలు ఎలా వెళ్లారో, నేటాలు చేరిన పిమ్మట వారి కండ్లు ఎలా తెరుపుడు పడ్డాయో, కండ్లు తెరుపుడు పడ్డా వీళ్లు నేటాలులోనే ఎందుకు వున్నారో. తరువాత కూడా భారతీయులు అక్కడికి ఎందుకు వెళ్లారో అక్కడకు వెళ్ళి నీతిమత వ్యవహారాల్ని బంధనాల్ని ఎలా తెంచి వేసుకున్నారో, లేక ఆ బంధనాలు ఎలా తెగిపోయాయో, నిర్భాగ్యులైన భారతీయ కార్మికుల పెండ్లి అయిన భార్యలకు వేశ్యలకు మధ్యన గల వ్యత్యాసం ఎలా తొలగిపోయిందో ఆ కధంతా యీ చిన్ని గ్రంధంలో వ్రాయడం సాధ్యం కాని పని

భారతీయ కార్మికులు. ఎగ్రిమెంటు ప్రకారం నేటాలు వెళ్లిన భారతీయులుగా నమోదయ్యారు. దానితో భారతీయులు తాము గిరీమిటియాలమని (ఒప్పందంకుదుర్చుకొని వచ్చిన బానిస కార్మికులు) చెప్పుకోవడం ప్రారంభించారు. అందువల్ల యిక ముందు ఎగ్రిమెంటును గిర్‌మిట్ అని అంటాను దాని ఆధారంగా వెళ్లిన కార్మికులను గిర్‌మిటియాలని అంటాను