పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/65

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

తెలియక యొక వెలఁది, యెంగిలినీరు చల్లెను. ఆమెయు తనతప్పిదము తెలిసికొని, తత్క్షణము క్రిందికి వచ్చి, యెంగిలినీరు పడిన యా భక్తుని తోడ్కొనిపోయి, యభ్యంజనాదిక్రియల నొనరించి తన్ను క్షమింపుమని గోరెను. గుండయయు నామెను వీడి యింటికి వచ్చినతోడనే గుండయభార్య, యీతని వైఖరిని గనిపెట్టి సానియింటినుండి వచ్చితివని యాతనిపై కోపించి, తన్ను ముట్టిన తిరునీలకంఠదేవరయానయని యొట్టువెట్టెను. దంపతు లీనియమముతో నెనుబదియేం డ్లుండిరి. ముదుసలు లైరి. అంతట నీశ్వరుఁడు భక్తునివేషము దాల్చి, వీరికడకువచ్చి వీరి కొకకప్పెర నిచ్చి దాచుఁడనియు, తాను కోరినపు డీయవలయునని చెప్పి వెడలిపోయెను. శివుడు వెడలిపోయి, కప్పెర నదృశ్యము చేసి, తిగివచ్చి దాని నిమ్మని కోరెను. గుండయ్యయు భార్యయు వడవడ వడఁకుచు తమ కేమి తెలియదని చెప్పిరి. ఈశ్వరుఁడు వారల నచ్చటకు దగ్గఱగనున్న గుండములో నుఱికి తెలియదని శపథము చేయగోరెను. వారట్లు గుండమున దుముకగానే, వారిరువురు నవయౌవను లైరి. ఈశ్వరుఁడు ప్రత్యక్షమై వారి నెనుబదేండ్లవఱకు నిట్లే యౌవనవంతులుగ నిలిపి, వెనుక ప్రమథగణమునఁ జేర్చుకొనెను.

పంచమీవిభక్తి

ఉ. పోయెడుఁగాల మన్యగతి బొందదు, మోక్షము వెండికొండకుం
    బోయెడుత్రోవ మీ కెఱుఁగఁబోలదు మానవులార! రండు లేఁ
    బ్రాయపుఁగొండ కందు శివభక్తులలోపల నద్రిరాజక
    న్యాయుతపుణ్యమూర్తివలనం గడతేరెడు జన్మఖేదముల్.