పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

(ఈపేరితో త్రిపురాంతకుని కారోపింపఁబడిన ముద్రితగ్రంథ మొకటి గలదు. ఈ తాటాకుప్రతి యాముద్రితపుస్తకముసకు మూలమేమో పరిశీలింపఁదగియున్నది).

కాని గ్రంథప్రకాశకులు పైని వ్రాసినట్లు సీనమరాజుగాని, పరమానందతీర్థుఁడు గాని త్రిపురాంతకోదాహరణగ్రంథకర్త కాజాలఁడు. సీనమరాజు ప్రాచీన ద్రావిడ శైవభక్తుఁడు. చేరమరాజని యీతని నామాంతరము. ఈతఁ డెనిమిదవశతాబ్దికిఁ బూర్వుఁడు. ఈతఁడు గ్రంథకర్తయగుట యసంభవము గదా! ఇఁక “పరమానందతీర్థమువలన” అనునది కేవల గ్రంథస్థవిషయము. ఇది పంచమావిభక్తికళికయందు ద్వితీయపాదమున ‘మఱియు సకలాశ్రితుల మనుచు నర్థమువలన’ యనుదానితో సార్థకతఁ జెందినది. ఇచట కేవలానందజలధితీర్థమనియే కవి భావము. అయినను గ్రంథకర్త పరమానందతీర్థు లనుకొనుటకుఁ గారణము లేకపోలేదు. వివరణగ్రంథమున, పరమానందతీర్థకవికృతగ్రంథములు పెక్కులుండుటచేత నామసాదృశ్యముచేత పరమానందతీర్థులని భ్రాంతిపొడమి యట్లు వ్రాసిరి గాని వేఱు గాదు. పరమానందతీర్ణుఁడను వేదాంతకవి, అనుభవదర్పణము, శివజ్ఞానమంజరి, బ్రహ్మవిద్యాసుధార్ణవము, భగవద్గీతావ్యాఖ్యానము, ముక్తికాంతావిలాసము, దత్తాత్రేయ, శివముకుంద, సంపంగిమన్న శతకత్రయము మున్నగు బహుళగ్రంథములు రచియించినాఁడు. ఈతఁడు పదునాఱవశతాబ్దము నాఁటివాఁడు. ఈతనిచరిత్రము శతకకవులచరిత్రయందు వర్ణితము. పుటలు (167-17l) ఈతఁడును త్రిపురాంతకోదాహరణకర్త కాఁజాలఁడనుటకుఁ బైవివరణము చాలును.