పుట:తెలుగు వాక్యం.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

14

తెలుగు వాక్యం

న్నాము. లోతుగా పరిశీలిస్తే ఇంతకన్నా విశేషమైన సంబంధాలను గుర్తించాల్సి ఉంటుంది. నిజానికి పై మూడు వాక్యాలలోను కార్మిక నాయకుడు అనే పదానికి క్రియతో ఒకే సంబంధముంది. చనిపోపు అనే వ్యాపారానికి అనుభోక్త మూడు వాక్యాలలోను కార్మిక నాయకుడే, వాక్యాలలో క్రియావ్యాపారానికి అందులో నామ పదానికి ఉన్న పాత్రనుబట్టి ఈ సంబంధాన్ని నిర్ణయించాలి. ఉదాహరణకి ఈ కింది వాక్యాలని పరిశీలించండి.

(25)

a. అన్నం ఉడికింది.
b. వంటమనిషి అన్నం వండింది.
c. యజమానురాలు వంటమనిషిచేత అన్నం వండించింది.

ఈ వాక్య సమూహంలో మూడిట్లోను అన్నం అనేదాని పాత్ర ఒకటే. ఇది వ్యాపార ఫలితంగా వచ్చే పదార్థం. మొదటి వాక్యంలో అన్నం కర్త కాదు, స్థూలదృష్టితో మాత్రమే కర్త అవుతుంది. ఇట్లాగే ఈకింది వాక్యాలను కూడా పరిశీలించండి.

(26)

a. తలుపు తీసి ఉంది.
b. మా అబ్బాయి తలుపు తీశాడు.
c. మా అబ్బాయిచేత తలుపు తీయించాను.

పై వాక్యాలలో తలుపు కర్త కాదు. క్రియ తలుపు ఉన్న స్థితిని సూచిస్తుంది. వాక్య నిర్మాణంలో వివిధ రీతుల్ని పరిశీలించాలంటే క్రియా వ్యాపారాలతో, లేక స్థితులతో నామపదాలకున్న అంతర్గత సంబంధాలను సమగ్రంగా తెలుసుకోవాలి.

1.244 : కొన్ని వాక్యాలలో ప్రేరణార్థక క్రియ వాక్యభేదాన్ని బట్టి ఒకే నామంతో భిన్న సంబంధాలను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకి ఈ కింది వాక్యాలు చూడండి.

(27)

a. సుబ్బారావు రామారావుని చదివిస్తున్నాడు.
b. సుబ్బారావు రామారావుచేత చదివిస్తున్నాడు.

వీటిల్లో మొదటి వాక్యానికి రెండర్థాలున్నాయి. ఒక అర్థంలో రామారావు చదువుకి అవసరమైన డబ్బు పెట్టుబడి సుబ్బారావు పెడుతున్నాడు అని. రెండో