పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46. తెలుగు భాషా చరిత్ర

2.48. భూతధాతుజ విశేషణం. తెలుగులో క్రియకి - ఇన చేర్చటం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇందులో -ఇన్‌- భూత్యప్రత్యయం, -అకారం విశేషణ ప్రత్యయం తమిళ, మలయాళాల్లో స్పర్శంతో అంతమయ్యే క్రియల్లో భూతధాతుజ విశేషణం -ఇన (ప్రాచీన తమిళం -ఇయ) చేర్చడం వల్ల ఏర్పడుతుంది. త. మ. పాటిన : తె. పాసిన, కలంకిన : తె. కలఁగిన ఆభాషల్లో మిగిలిన క్రియల్లో -త్‌-, -న్త్‌-, -త్త్‌- ప్రత్యయాల తరవాత అకారం చేరడం వల్ల ఈ రూపం ఏర్పడుతుంది : త. మ చెయ్‌త: తె. చేసిన, త. మ. వంత : తె. వచ్చిన. కాబట్టి తెలుగులో ఈ రూపంలో -ఇన్‌- అనే భూత ప్రత్యయం అన్ని క్రియల్లోకి వ్యాపించిందని తెలుస్తుంది.                                                  
                                                                        
     పడిన, చెడిన - తగిన అనే వాటికి పర్యాయాలైన పడ్డ (త. మ. క. పట్ట) చెడ్డ (త. మ. క. కెట్ట), తగ్గ (త. మ. క. తక్క) అనే రూపాల్లో (బా. వ్యా. క్రియా. 51) -త్‌- అనే భూతప్రత్యయం ధాతువు చివరి హల్లుతో సమీకృతమై నేటికీ నిలిచి ఉంది. వీటిలో -ఇన్‌- లేదు. కాబట్టి ఇవే ప్రాచీన రూపాలనీ, పడిన, చెడిన, తగిన అనేవి -ఇన్‌- సర్వత్రా వ్యాపించడం వల్ల ఏర్పడిన అర్వాచీన రూపాలనీ చెప్పవచ్చు. అన్న, కొన్న, తిన్న, మొదలైన నకారాంతధాతువుల భూతధాతుజ విశేషణ రూపాలు అనిన, కొనిన, తినిన మొదలైన వాటిలో రెండు నకారాలమధ్య ఇకారం లోపించడం వల్ల ఏర్పడినవి. 
                                                                    
 2.49.  తద్థర్మధాతుజ విశేషణం. ఇది ధాతువుకి ఎడి, ఎడు చేర్చడం వల్లగాని ఏమీ చేర్చక పోవడం వల్లగాని ఏర్పడుతుంది : వండు, వండెడి, వండెడు. -ఎడి, ఎడులకి మిగిలిన భాషల్లో సమాన రూపాలు ఇంతవరకూ దొరకలేదు. ఇక చేయు (వాఁడు) మొదలైన వాటిలో ఉకారం భావికాలిక ప్రత్యయమైన *-ఉమ్‌ నించి వచ్చినది. వీటి తరవాత అచ్చుతో మొదలయ్యే పదం వస్తే ఈ ఉకారం తరవాత నకారం వస్తుంది : చేయనతఁడు. ఈ నకారం ప్రాచీనమైన మకారం నించి వచ్చినది (చూ. 2.45). ఇది తెలుగులో హల్లుపరమైనప్పుడు నశిస్తుంది. తమిళ, మలయాళాల్లో - ఉమ్‌తద్ధర్మధాతుజ విశేషణంగా ఉంది; తె, చేయు (న్‌); త. మ. చెయ్యుమ్‌, తె. పాడు (న్‌) ; త. మ. పాటుమ్‌.               
                                                                    
 2.50.  వ్యతిరేక క్త్వార్థకం.  తెలుగులో ఇది ధాతువుకి - అక చేర్చడం వల్ల  ఏర్పడుతుంది. పర్జీలో కూడా దీనికి ప్రత్యయం -అక. గోండీలో దీనికి ప్రత్యయం - వాక్‌ (సుబ్రహ్మణ్యం 1968 & 4.16).