పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

డా. భద్రిరాజు కృష్ణమూర్తిగారి సంపాదకత్వంలో వెలువడుతున్న 'తెలుగు భాషాచరిత్ర' తెలుగులో ఇటువంటి గ్రంథాలలో మొదటిది. ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రలేగాని సమగ్రమైన తెలుగు భాషా చరిత్ర రాలేదు. తెలుగుభాషపై భిన్నకాలాల, భిన్నాంశాలనుగూర్చి పరిశోధనలు జరిపిన పండితులు ఈ గ్రంథంలోని వివిధ ప్రకరణాలను రచించినారు. ఇటువంటి గ్రంథాన్ని ప్రకటిస్తున్నందుకు సాహిత్య అకాడమీ సంతోషిస్తున్నది.

అకాడమీ గత పదిహేడు సంవత్సరాలలో ఏ సంస్థలూ, ప్రచురణ కర్తలు చేయని ముఖ్యమైన ప్రచురణలు చేసినది, 'మాండలికవృత్తిపదకోశం' మొత్తం భారతీయ భాషలలోనే తొలిప్రయత్నము. మహాకవుల పదప్రయోగకోశాలు భావిలో తెలుగుభాషపై పరిశోధనలు చేసేవారికి కల్పతరువులు. ఈ కోవలో చెప్పుకోదగ్గ పనులలో 'తెలుగుభాషా చరిత్ర' ప్రచురణ ఒకటి.

తెలుగు భారతరాజ్యాంగము గుర్తించిన నాలుగు ద్రావిడ భాషలలో ఒకటి. భారతదేశంలో ద్రావిడభాషలను మాట్లాడేవారిలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అన్నిటికంటే ఎక్కువ. మొత్తం భారతదేశంలో హిందీ తరువాత ఈ విషయంలో తెలుగు రెండవస్థానం ఆక్రమిస్తుంది. దీనికి చాలా ప్రాచీనమైన సాహిత్యము, చరిత్ర ఉన్నది. నన్నయకు ముందు వెయ్యిసంవత్సరాలనాటికే తెలుగు స్వతంత్ర భాషగా స్థిరపడినట్లు కనిపిస్తున్నది. ఆనాటి తెలుగుభాషాస్వరూపాన్ని తెలుసుకోవటానికి శాసనాలే ఆధారం. నన్నయ తర్వాతకూడా తెలుగులో వచ్చిన మార్పులను తెలుసుకోవాలెనంటే శాసనాలే ప్రధానాధారాలవుతున్నాయి. సమకాలీన వ్యావహారిక భాషాస్వరూపం కొంతవరకైనా శాసనాల్లో కనిపిస్తున్నది. ఈ గ్రంథంతో నన్నయకు ముందునుంచి 18వ శతాబ్దివరకు సుమారు రెండువేల సంవత్సరాల శాసన భాషాచరిత్ర సమగ్రంగా దర్శన మిస్తున్నది, కావ్యభాషాచరిత్రకూడా ఇందులో ఉన్నది. అట్లాగే తెలుగులో ఇతర భాషాపదజాలం, తెలుగులిపి పరిణామం, అర్థపరిణామం, మాండలిక భేదాలు మొదలైన విషయాలు ఇందులో చర్చింపబడినవి. ఆధునిక భాషాస్వరూపం సంగ్రహంగానే అయినా సమగ్రంగా మొదటిసారి చర్చింపబడింది ఈ గ్రంథంలోనే తెలుగుకు ఇతర ద్రావిడ భాషలతోగల సంబంధం స్పష్టంగా