పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/372

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణం 13

ఆధునికభాష : సంగ్రహవర్ణనం

___చేకూరి రామారావు


    13.0. భాషలో అనుసూత్యంగావచ్చే మార్పులను గ్రహించాలంటే సాధ్యమైనంత వరకు ఇతర భాషలనుంచి వచ్చి చేరిన శబ్దజాలాన్ని వేరుచేసి పరిశీలించడం అవసరం. తెలుగులో ఇట్లా భిన్న కాలాలలో తెరలు తెరలుగా కొత్త పదాలు వచ్చి చేరాయి. కొన్ని భాషలో అంతకుముందే ఉన్న మాటలతో వేరుచేసి చూపించ లేనంతగా కలిసిపోయినా మరికొన్ని వేరుగానే ఉండిపోయినాయి. సంస్కృతం నుంచి వచ్చి చేరిన మాటల్లో ఆట్లా కలిసిపోయిన వాటిని తద్భవాలనీ, కలవకుండా ఉన్న వాటిని తత్సమాలనీ అనటం సంప్రదాయం. కలిసిపోవటమంటే భాషలో లేని ధ్వనుల సంయోజనంతో ఉన్న మాటలు ఉన్న ధ్వనుల సంయోజనంగా మారి పోవటం. తెలుగు వ్యవహర్తల్లో చారిత్రకంగా అధిక విద్యావంతులైనవారు అన్య భాషాపదాలను, సాధ్యమైనంతవరకు ఆ భాషోచ్చారణకు సన్నిహితమైన ఉచ్చారణను అనుసరించే అలవాటున్న వారుకావటంవల్ల ఇట్లా కలవని మాటలు తెలుగులో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందువల్లనే తెలుగులో తత్సమశబ్ద బాహుళ్యం. నేటి తెలుగులో ధ్వనుల నిర్మాణాన్ని సమగ్రంగా పరిశీలించాలంటే దేశ్యశబ్దాల్ని అన్యభాషా శబ్దాల్నుంచి వేరుచేసి చూడాలి. అప్పుడే ఏ ధ్వనులు తెలుగుకు సహజ పరిణామ సిద్ధాలో, ఏవి అన్యత్రావచ్చి చేరినవో తెలుసుకోవచ్చు.
    తెలుగులో తత్సమ, తద్భవ విభాగం వ్యవహర్తలందరికీ ఒకే రకంగా ఉండదు, తెలుగు, సంస్కృతాది సాహిత్యాలతో కొద్దో గొప్పో పరిచయం ఉన్న వారి భాషలో తత్సమా లయినవి ఇతరుల వ్యవహారంలో తద్భవాలు కావచ్చు. ఇతర భాషాశబ్దాల భిన్నత్వాన్ని నిలబెట్టే అవసరం లేని వారి వ్యవహారంలో తత్సమాలు తద్భవాలయిపోతాయి.