పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/303

ఈ పుటను అచ్చుదిద్దలేదు

288 తెలుగు భాషా చరిత్ర

9. 22. ఇక వ్యావహారికభాషలో అన్యభాషాపదాలూ మాండలికపదాలూ ఉన్నందువల్ల బాషా 'పరిశుభ్రత' లోపిస్తుందని, సులభంగా బోధపడదని, ఏకరూపత నశిస్తుందని వాదించటంలోని మంచిచెడ్డలను గమనించవలసి వుంది. తెలుగు ప్రత్యేకభాష కాబట్టి సంస్కృత ప్రాకృతపదాలుగాని తమిళ కర్ణాటాది భాషాపదాలుగాని మనకు అన్యభాషాపదాలే. వాటిని వాడటంలో లేని అభ్యంతరం రాజకీయ సాంఘిక సాంస్కృతిక కారణాలవల్ల తెలుగులోకి వచ్చిచేరిన ఉర్దూ ఇంగ్లీషు పదాలను వాడటంలో ఎందుకు రావాలి ? అన్యభాషాపదాల చేరిక ప్రపంచ భాషలన్నిటిలోనూ ఉంది.13 వాటిని పరిహరిస్తే 'వ్యవహారహాని' వస్తుందని అప్పకవిలాంటి ఛాందసలాక్షణికుడు కూడా అంగీకరించాడు.14 అందుకు మహాకవి ప్రయోగాలను కూడా అతడే అందిచ్చాడు.15 కాకపోతే సంస్కృత ప్రాకృతాల విషయంలో చేసినట్లు రూపనిష్పాదనాదులను ఇతర భాషాపదాలను విషయంలో మన లాక్షణికు లెవ్వరూ చేయలేదు. అన్యదేశ్యాలను పరిహరించాలని ప్రయత్నించిన జొనాథన్‌ స్విప్ట్‌లాంటి పండితులందరూ విఫలప్రయత్నులే అయ్యారు.16 మొదట్లో ఇతరభాషాపదాలైనా ఎరువు తెచ్చుకున్న తరవాత అవి తెలుగుమాటలే. వాటిని వాడటంలో తప్పులేదు. వాడినవాళ్ళు స్వభాష సరిగా రానివాళ్ళూ కాదు.17 ఎరువు మాటలుగా తమకు నచ్చిన లేదా తమరు ఆరాధించే పవిత్రమైన భాషలోని పదాలనే వాడాలనే 'ద్విభాషాపరిశుద్ధతావాదం' (bilingual purism) ప్రతి దేశంలోనూ ఉంది. అయితే అ వాదాదర్శం అసాధ్యంగా అగమ్యంగా మాత్రమే ఉంటున్నది.18 నిరక్షరాస్యుల నిత్యవ్యవహారంలోనే ఎన్ని అన్యభాషాపదాలు దొర్లుతున్నాయో గమనిస్తే ఈ ఆదర్శం ఎంత అర్ధరహితమో తెలుస్తుంది. ఇలాంటిదే మాండలికాల విషయంకూడా. నన్నయనాటినుంచి చిన్నయనాటివరకూ ఉన్న 'ప్రామాణిక' మహా కవుల ప్రయోగాల్లోనే ఎన్నెన్ని మాండలికపదాలు కనిపిస్తున్నాయో చిలుకూరి నారాయణరావుగారు, గిడుగు రామమూర్తి గారూ ఎత్తి రాశారు.19 కవి సంఘజీవి. అతడు తనకు స్ఫురణకు వచ్చిన పదజాలంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా, విస్పష్టంగా అందించగల మాటలను ఎన్నుకొంటాడు. అవి మాండలికాలయినా వచ్చే ఇబ్బందిలేదు. ఒక మాటకున్న అర్ధాన్ని ప్రకరణాన్నిబట్టి గ్రహించటం ఎప్పుడూ సాధ్యమే. అంతే కాదు. మాండలికపదాలన్నీ భాష అపభ్రష్టమైనందువల్ల ఏర్పడ్డవనుకోవటం పొరపాటు. ఒక్కొక్కప్పుడు, సాహిత్యపదజాలంలో లేని ప్రత్యేకార్థస్ఫూర్తిని అవి మాత్రమే కలిగించగలవు.20 మాండలికాలను వాడినంత మాత్రాన కవితాశిల్పానికిగాని గౌరవానికిగాని లోపం రాదనటానికి వాటిని వాడిన