పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/56

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0110-01 శంకరాభరణం సం: 02-055 వైరాగ్య చింత

పల్లవి: లేదు భయము మఱి కాదు భవము
ఆదియు నంత్యముఁ దెలిసిన హరియాజ్ఞే కాన
    
చ. 1: తలఁపులు గడుగక వొడ లటు తాఁ గడిగిన నేమి
వెలుపలి కాంక్షలు వుడుగక విధులుడిగిన నేమి
అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమఁ గలిగిన యాతఁడు
చెలఁగుచు పనులైనా సేసిన మరి యేమి
    
చ. 2: పొంచినకోపము విడువక భోగము విడిచిననేమి
పంచేంద్రియములు ముదియక పై ముదిసిన నేమి
నించిన దైవము నమ్మిన నిర్భరుఁడయిన యాతఁడు
యెంచుక యేవర్గంబుల నెట్టుండిన నేమి
    
చ. 3: వేగమె లోపల గడువక వెలి గడిగిన నేమి
యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి
యీగతి శ్రీవేంకటపతి నెఱిఁగి సుఖించేటి యాతఁడు
జాగుల ప్రపంచమందును సతమైనా నేమి