పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/513

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0199-05 సామంతం సం: 02-512 శరణాగతి

పల్లవి:

నీ చేతఁలోవారము నీవారము
యేచి నీకే చేత మొక్కే మిదియే మావ్రతము

చ. 1:

ఇన్నిటాఁ బూర్ణుఁడవు నీ వెరఁగని యర్థమేది
విన్నపము నేఁ జేసే విధమేది
మన్నించిన నీమన్ననే మహిమలో మాబ్రదుకెల్ల
వున్నతి మీదాసిననే దొక్కటే మావ్రతము

చ. 2:

ఘనదేవుఁడవు నీకుఁ గడమలు మరియేవి
గొనకొని నే నిన్నుఁ గొసరేదేమి
పొనుగక యేలితివి పుట్టిన మాపుట్టుగెల్ల
ననిచి నిన్ను నమ్మిన నమ్మికే మావ్రతము

చ. 3:

శ్రీవేంకటేశుఁడ నీవు చి త్తగించనిది యేది
భావించి నేఁ బొందని భాగ్య మేది
యేవల మాపరభారా లింతయు నీకెక్కినది
ఆవటించి నే నీశరణన్నదే మావ్రతము