పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/512

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0199-04 ముఖారి సం: 02-511 వైష్ణవ భక్తి

పల్లవి:

అతఁడే గతియని యంటే నన్నిటా మాన్యుఁడు
ఇతరాలు మానఁగానే యీతనికే శలవు

చ. 1:

శ్రీరమణుని నిత్యసేవకులకుఁ దొల్లె
వేరులేని కర్మముల వెట్టి మాన్యము
ఆరీతి నితనిభక్తులైన చనవరులకు
ఆరితేరి పుణ్యపాపా లడ్డపాటు లేదు

చ. 2:

తక్కక యితనిముద్ర ధరించిన దాసులకు
చొక్కుల భవబంధాల సుంక మాన్యము
లెక్కించ నితనికైన లెంకలకు బొడుకల-
కొక్కట విధినిషేధా లూహింపలేవు

చ. 3:

సరుస శ్రీవేంకటేశు శరణాగతులకును
పరగ మాయల దొడ్డిబందె మాన్యము
పరమమైన యితని పళ్లెముకూటివారికి
ధరలో నేమిటివంకాఁ దప్పులే లేవు