పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/510

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0199-02 బౌళి సం: 02-509 కృష్ణ

పల్లవి:

పరమ పురుషుఁడీ బాలుఁడట
హర విరుంచులు మొక్కేరదివో వాకిటను

చ. 1:

దేవుఁడితఁడు సర్వదేవతల కొడయఁడు
వేవేలు వేదములచే వేద్యుఁడితఁడు
దేవకీదేవికి వసుదేవునికిఁ గొడుకాయ
యీవిధము నోఁచిరి వీరెంత భాగ్యవంతులో

చ. 2:

అంతటాఁ దానున్నవాఁడు అరయ స్వతంత్రుఁడు
అంతయు నాదియులేని ఆదిమూరితి
వంతుకు యశోదకు నవ్వల నందగోపునికి
దొంతరకొడుకైనాఁడు తొల్లి వీరే పుణ్యులో

చ. 3:

ఇందిరావల్లభుఁడు ఇహపరనాయకుఁడు
కందువ శ్రీవేంకటాద్రిఁ గాపున్నవాఁడు
మందగొల్లెతలకెల్ల మరఁది దానైనాఁడు
ఇందరు నిందరే వీరి కెన్నటి సంబంధమో