పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/500

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0197-04 రామక్రియ సం: 02-499 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

ఆతనిఁబో పొగడేము ఆతని శరణంటిమి
ఆతఁడే సర్వజీవుల అంతర్యామి

చ. 1:

పెక్కు బ్రహ్మాండకోట్లు పెక్కు బ్రహ్మకోట్లు
పెక్కు రుద్రకోట్లును పెక్కు యింద్రులు
వొక్కొక్క రోమకూపాల నొగి నించుకుండునట్టి
వొక్కఁడే విష్ణుఁడు వీఁడే వున్నతోన్నతుఁడు

చ. 2:

అనంత సూర్యచంద్రులు అనంత వాయువులును
అనంత నక్షత్రము లనంత మేరువులు
కొనలు సాగీ నన్నిటి కూటువఁ గూడుకొన్నట్టి
అనంతుఁడొక్కఁడే మించీ నాదిమూరితి

చ. 3:

అసంఖ్యమహిమలను అసంఖ్యమాయలు
అసంఖ్యశక్తులు వరాలసంఖ్యములు
పొసఁగ నిన్నిటిఁ దానే పుట్టించి రక్షించినట్టి
అసంఖ్యాతుఁడు శ్రీవేంకటాద్రీశుఁడు