పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/498

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0197-02 సాళంగనాట సం: 02-497 రామ

పల్లవి:

నరుఁడా యీతఁడు ఆదినారాయణుఁడు గాక
ధరణిఁ గీరితికెక్కె దశరథసుతుఁడు

చ. 1:

యీతఁడాతాటకిఁ జంపె నీమారీచసుబాహుల-
నీతఁడా మదమణఁచె నిందరుఁ జూడ
యేతులకు హరువిల్లు యీతఁడా విరిచి యట్టె
సీతఁ బెండ్లియాడెను యీచిన్నరాముఁడా

చ. 2:

చుప్పనాతిముక్కు గోసి సోదించి దైత్యులఁ జంపి
అప్పుడిట్టె వాలి నేసినాతఁ డీతఁడా
గుప్పించి కోఁతుల నేలి కొండల జలధి గట్టి
కప్పి లంక సాధించె నీకౌసల్యనందఁనుడా

చ. 3:

రావణాదులనుఁ జంపి రక్షించి విభీషణుని
భావిం చయోధ్య నీతఁడు పట్టమేలెను
శ్రీవేంకటేశుఁ డితఁడే సృష్టి రక్షించె నితఁడే
యీవల మాపాలనున్న యారామచంద్రుఁడా