పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/490

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0195-05 దేవగాంధారి సం: 02-490 వైరాగ్య చింత

పల్లవి:

అడ్డము చెప్పగరాదు అవుఁగాదనఁగరాదు
వొడ్డిన దనుభవించే దోపిక జీవులది

చ. 1:

యీరికలెత్తె జన్మము లిన్ని జంతువులయందు
కోరికల గొనసాగెఁ గోటానఁగోటి
నారుకొనె సంపదలు నానారూపములై
తీరదేమిటా నీచిక్కు దేవుఁడు వెట్టినది

చ. 2:

అల్లుకొనెఁ గర్మములు అక్కడికి నిక్కడికి
వెల్లవిరాయను మాయ వెనకా ముందు
కెల్లురేఁగె దేహమందే కిమ్ముల చుట్టరికాలు
పొల్లువో దెన్నఁడు భూమి పుట్టగాఁ బుట్టినది

చ. 3:

పండెను సంసారము ఫలమైన నానాఁటికి
నిండెను నాలికకు నెమ్మదిఁ జవులు
అండనే శ్రీవేంకటేశుఁ డంతర్యామై వుండి
వండ వండనట్లుగ (?) వన్నె కెక్కెంచినది